రాముడంటే కాంగ్రెస్​కు ఎందుకంత ద్వేషం?: ప్రధాని మోదీ

రాముడంటే కాంగ్రెస్​కు ఎందుకంత ద్వేషం?: ప్రధాని మోదీ
  • గుడి కట్టాక యూపీని ఇష్టపడటం లేదు: మోదీ
  • వారణాసి యువతను తాగుబోతులు అంటున్నరు
  • ఎప్పుడూ సోయిలో ఉండనోళ్లు యూపీని విమర్శిస్తున్నరు
  • ఇండియా కూటమి దళిత, గిరిజన వ్యతిరేకి అని ఫైర్
  • వారణాసిలో రూ.13వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన

వారణాసి: ఇండియా కూటమి దళిత, గిరిజన వ్యతిరేకి అని.. కులం పేరుతో ప్రజలను రెచ్చగొడ్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. తమను పొగిడే వాళ్లనే మాత్రమే ఇష్టపడుతారని విమర్శించారు. రామ మందిర విషయంలోనూ కాంగ్రెస్ లీడర్లు ఇలాగే ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు అంటే కాంగ్రెస్​కు ఎందుకంత ద్వేషమని నిలదీశారు.

తమ ఫ్యామిలీ, ఓటు బ్యాంకు తప్ప ఏమీ చూడరని మండిపడ్డారు. వారణాసి యువత తాగి రోడ్లపై పడి ఉన్నారని రాహుల్ చేసిన కామెంట్లను మోదీ ఖండించారు. ఎవరైతే సోయిలో ఉండరో.. వాళ్లే యువతను తాగుబోతులు అంటున్నారని చురకలంటించారు. దళితులు, గిరిజనులు అంటే అపోజిషన్ లీడర్లకు చిన్నచూపు అని ఆరోపించారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేస్తుంటే చూసి ఓర్వలేకపోయారని మండిపడ్డారు. 
కనీసం తెలివి లేకుండా మాట్లాడుతున్నరు

వారణాసి పర్యటనలో భాగంగా రూ.13వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్​యూ)లో ‘సంసద్ సంస్కృత ప్రతియోగిత’ విన్నర్స్​తో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా, సంత్ రవిదాస్ 647వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్​కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు.

‘‘అపోజిషన్ లీడర్లు నన్ను కొన్ని దశాబ్దాలుగా తిడ్తూనే ఉన్నరు. కానీ.. ఇప్పుడు వాళ్లు తమ అసహనాన్ని ప్రజల మీద చూపిస్తున్నరు. కనీసం తెలివి లేకుండా యూపీ యువతను తాగుబోతులు అంటున్నరు. కాంగ్రెసోళ్లే సోయిలో ఉండరు... అలాంటిది వారణాసి యువతను తిడ్తున్నరు. రాహుల్ గాంధీ కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్న’’అని మోదీ అన్నారు.

నేనూ బనారసీగా మారిపోయా

‘కాంగ్రెస్ కుటుంబానికి చెందిన యువరాజు (రాహుల్) యూపీ యువతను అవమానిస్తుంటే.. కూటమిలోని అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. కుటుంబ రాజకీయాల కారణంగానే యూపీ కొన్ని దశాబ్దాల పాటు డెవలప్ కాలేదు. అవినీతి, బుజ్జగింపు, వారసత్వ రాజకీయాలే యూపీ అభివృద్ధిని అడ్డుకున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎంతో డెవలప్ అయింది. వారణాసి ఎంపీగా పదేండ్లు ఉన్న.

అదే నన్ను బనారసీగా మార్చేసింది. కాశీ ప్రజల జీవితాలు మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని మోదీ అన్నారు. రైతులు, పేదల కోసం తన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, మహిళా సాధికారత కోసం పాటుపడ్తున్నదని వివరించారు. చేతి వృత్తిదారులను ఆదుకున్నామని, రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలకు అంబాసిడర్​గా ఉంటానని తెలిపారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు టాయిలెట్లు కడ్తుంటే కొందరు విమర్శించారన్నారు.  

సంత్ రవిదాస్ అందరివారు

‘‘సంత్ రవిదాస్ అందరి వారు. ఆయన కులం, మతం, వర్గాలను పట్టించుకోలేదు. అందరూ సమానమని ప్రచారం చేశారు. ఆయన ఆలోచనలు సరిహద్దులు దాటాయి. లక్షలాది మంది ఆయనకు అనుచరులుగా ఉన్నారు. అందులో నేనూ ఒకడిని. ఆయన చూపిన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుతున్నాను. సంత్ రవిదాస్ అనుచరులకు సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను”అని మోదీ అన్నారు.

రవిదాస్ ఆలోచనలు, సూచనలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నదని తెలిపారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ఆయన మంత్రమే అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారణాసిలో సంత్ రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూ.32 కోట్లతో కట్టబోయే సంత్ రవిదాస్ జన్మ స్థల్, మ్యూజియం, సుందరీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఉత్తరప్రదేశ్​ పర్యటనలో భాగంగా పలు రోడ్లు, కుకింగ్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, సిల్క్ ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా, నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని కూడా నిర్మించనున్నారు. బీహెచ్​యూలో కొత్త మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. సిగ్రా స్పోర్ట్స్ స్టేడియం ఫేజ్ 1, డిస్ట్రిక్ రైఫిల్ షూటింగ్ రేంజ్​ను ప్రారంభించారు.