
- పోరాడిన వీరులందరికీ నివాళి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎప్పటికీ మరిచిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు ప్రాణాలర్పించిన వాళ్లందరికీ నివాళి అర్పిస్తున్నాను. మన దేశ చరిత్రలో ఎమర్జెన్సీ మరిచిపోలేని అధ్యాయం. అది మన రాజ్యాంగ విలువలకు విరుద్ధం” అని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించింది. 21 నెలల పాటు నిర్బంధం కొనసాగింది. ఎమర్జెన్సీ విధించి 48 ఏండ్లయిన సందర్భంగా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ కాంగ్రెస్ నియంతృత్వ మనస్తత్వానికి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ‘‘1975లో ఈరోజున ఓ కుటుంబం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ప్రజల హక్కులను లాక్కున్నది. ప్రజాస్వామ్యాన్ని చంపేసింది. అధికారం పోతుందన్న భయంతోనే ఇదంతా చేసింది” అని ఆయన ట్వీట్ చేశారు. ఆ టైమ్ లో దేశంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు లక్షలాది మంది పోరాడారని, వాళ్లందరికీ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారు: నిర్మలా సీతారామన్
ఎమర్జెన్సీ టైమ్‌లో వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోయిందని, పత్రికా స్వేచ్ఛను కాలరాశారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అప్పట్లో మీడియా ఎదుర్కొన్న పరిస్థితులను తెలియజేస్తూ పేపర్ క్లిప్పింగ్స్‌ను ట్విట్టర్లో ఆమె పోస్టు చేశారు. ‘‘అధికార దాహంతో కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించింది. పత్రికా స్వేచ్ఛను హరించింది. ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టింది” అని ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ టైమ్ ను, దాన్ని మన దేశం అధిగమించిన తీరును గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన దేశభక్తులందరికీ నమస్కరిస్తున్నానని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ట్వీట్ చేశారు.