ఢిల్లీలో హై అలర్ట్.. రాజధాని వ్యాప్తంగా మోగుతున్న సైరన్లు..

 ఢిల్లీలో హై అలర్ట్.. రాజధాని వ్యాప్తంగా మోగుతున్న సైరన్లు..

ఇండియా- పాక్ ఉద్రిక్తతల నడుమ దేశ రాజధాని ఢిల్లీ ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్ధమైంది. ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పౌరులను అలర్ట్ చేసేందుకు భద్రతా దళాలు ఢిల్లీలో సైరన్ లు ఏర్పాటు చేశారు. 

శుక్రవారం (మే 9) రక్షణ శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఢిల్లీలో సైరన్ టెస్ట నిర్వహించారు. ఐటీఓ లోని PWD (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్) బిల్డింగ్ పై సైరన్ ను ఇన్ స్టాల్ చేసి పరీక్షించారు. మధ్యాహ్నం 3 గంటలకు సైరన్ ను 15 నుంచి 20 నిమిషాల పాటు మోగించారు. 

పాకిస్తాన్ మిస్సైల్స్, బాంబులు ప్రయోగించే అవకాశం ఉన్నందున రాజధాని వ్యాప్తంగా సైరన్ లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సైరన్ లను మోగిస్తారు. ఆ సమయంలో ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాలలో ఉండాలనే ఉద్దేశంతో సైరన్ మోగిస్తారు.

భద్రతా దళాల అధికారులు సైరన్ లను ఏర్పాటు చేస్తున్న సమయంలో ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ కూడా సమీక్షించారు. సైరన్ పరీక్షిస్తున్నప్పుడు ప్రజలు ఆందోళనకు గురి కావద్దని ముందుగానే సందేశం పంపారు. ఢిల్లీలోని అన్ని ఎత్తైన భవనాలపై సైరన్ లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్క సైరన్ సుమారు 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. 

శుక్రవారం రాత్రి 40 నుంచి 50 సైరన్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏదైన అత్యవసర పరిస్థితుల్లో సైరన్ మోగిస్తామని, వెంటనే ప్రజలు ఇళ్లల్లోకి సురక్షిత ప్రాంతాలలోకి వెళ్లి తల దాచుకోవాలని సూచించారు.