గుజరాత్ర్ లో . 80 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని

గుజరాత్ర్ లో . 80 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని
  • ఇంటింటా సోలార్ ప్యానెళ్లతో విద్యుత్ ఉత్పత్తి
  • రూ. 80 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని 

మోధెరా: దేశంలో ఇరవై నాలుగు గంటలూ సోలార్ కరెంట్ నే వాడుతున్న తొలి గ్రామంగా గుజరాత్ లోని మోధేరా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం గుజరాత్ చేరుకున్న ఆయన మెహసానా జిల్లా మోధెరా గ్రామం వద్ద 24x7 సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. సూర్య దేవాలయంతో ప్రసిద్ధి చెందిన మోధెరా ఇప్పుడు ‘సూర్యగ్రామం’గా మారిందన్నారు. ఈ ఊరంతా ఒక రెన్యువబుల్ ఎనర్జీ జనరేటర్ లా తయారైందన్నారు. ‘‘ఇప్పటివరకూ ఈ ఊరి ప్రజలు గవర్నమెంట్ సప్లై చేసే కరెంట్ ను వాడుకుని బిల్లులు కట్టారు. ఇప్పుడు ఇంటింటా సోలార్ పవర్ వాడకంతో 60% నుంచి 100% వరకూ కరెంట్ బిల్లులు కట్టాల్సిన అవసరం తప్పింది. ప్రజలు తాము ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెళ్లతో తమ కరెంట్ ను తామే ఉత్పత్తి చేసుకోవచ్చు. సోలార్ కరెంట్ ను అమ్మి డబ్బులు కూడా సంపాదించొచ్చు” అని ప్రధాని అన్నారు. మోధెరా, మెహసానాతోపాటు మొత్తం నార్త్ గుజరాత్ అంతా వేగంగా అభివృద్ధి జరుగుతోందని మోడీ చెప్పారు. డైరీ, స్కిల్ డెవలప్ మెంట్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో అనేక ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ‘‘ఒకప్పుడు గుజరాత్ లో సైకిళ్లు కూడా తయారయ్యేవి కాదు. ఇప్పుడు కార్లు కూడా తయారు చేస్తున్నాం. రాష్ట్రంలో విమానాలను తయారు చేసే రోజు కూడా ఎంతో దూరంలో లేదు” అని ప్రధాని అన్నారు. మోధెరా సన్ టెంపుల్ వద్ద 3డీ లైట్, సౌండ్ షోను కూడా మోడీ ప్రారంభించారు. 

12 ఎకరాల్లో రూ. 80 కోట్లతో..
మోధెరా గ్రామంతో పాటు ఇక్కడి సూర్య దేవాలయానికి 24 గంటలూ సోలార్ పవర్ ను అందించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. గ్రామంలో ఉత్పత్తి అయ్యే సోలార్ కరెంట్ ను స్టోర్ చేసేందుకు సూర్యదేవాలయానికి 6 కిలోమీటర్ల దూరంలోని సుజ్జన్ పురా వద్ద ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం గుజరాత్ ప్రభుత్వం 12 ఎకరాల స్థలం కేటాయించింది. ప్రాజెక్టుకు రూ. 80.66 కోట్లు ఖర్చు కాగా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం ఫండ్స్ కేటాయించాయి. కాగా, ప్రధాని మోడీ సోమ, మంగళవారాల్లో భరూచ్, జామ్ నగర్ లో పర్యటించనున్నారు. భరూచ్​లో రూ. 8 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం అహ్మదాబాద్ లో సివిల్ హాస్పిటల్​కు, మరికొన్ని ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపనల కార్యక్రమాల్లో కూడా ప్రధాని మోడీ పాల్గొననున్నారు.   

త్వరలో లోక్ సభ నియోజకవర్గాల్లో మోడీ ర్యాలీలు 
ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 40 ర్యాలీలు నిర్వహించనున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన 144 నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఈ మొత్తం నియోజకవర్గాలను కవర్ చేసేలా 40 ర్యాలీల్లో మోడీ పాల్గొననున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో బలం పెంచుకునేందుకు ఈ మేరకు ‘లోక్ సభ ప్రవాస్ యోజన’ పేరుతో చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీ నేతలు అన్ని వర్గాల ప్రముఖులు, నేతలతో భేటీ కానున్నారు. బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర అగ్ర నేతలు 104 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.