నాగాలాండ్ ప్రజలను మోదీ మోసం చేసిన్రు.. రాహుల్ గాంధీ ఫైర్

నాగాలాండ్ ప్రజలను మోదీ మోసం చేసిన్రు.. రాహుల్ గాంధీ ఫైర్

కోహిమా :  నాగాలాండ్ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. నాగాలాండ్​లో రాజకీయ సమస్యను పరిష్కరిస్తానని తొమ్మిదేండ్ల కింద హామీ ఇచ్చిన మోదీ.. అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఫైర్ అయ్యారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బుధవారం నాగాలాండ్ లోని మొకోక్ చుంగ్​లో పబ్లిక్ ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. నాగాలాండ్ ప్రజలతో మాట్లాడకుండా, వాళ్ల నమ్మకం పొందకుండా సమస్యకు పరిష్కారం చూపడం అసాధ్యమని అన్నారు.

 ‘‘మీ దగ్గర పరిష్కారమే లేనప్పుడు.. సమస్యను పరిష్కరిస్తామని అబద్ధాలు చెప్పడం కరెక్టు కాదు. పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పాలి” అని మోదీని ఉద్దేశించి అన్నారు. కాగా, నాగాలాండ్​లో 1947లో తిరుగుబాటు మొదలైంది. నాగా ప్రజలకు ప్రత్యేక జెండా, రాజ్యాంగం కావాలని రెబెల్ గ్రూప్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్ సీఎన్–ఐఎం) డిమాండ్ చేస్తున్నది. సమస్య పరిష్కారం కోసం ఎన్ఎస్ సీఎన్-–ఐఎంతో 2015లో కేంద్రం ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తర్వాత ఎలాంటి ముందడుగు పడలేదు.

దేశంలో సైద్ధాంతిక యుద్ధం.. 

నాగాలాండ్​లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కరెంట్ సరఫరా సరిగాలేదని రాహుల్ అన్నారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో నాగాలాండ్ యువత.. దేశంలోని మిగతా యువతతో ఎలా పోటీ పడగలరు? వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎలా ఆశించగలం?” అని ప్రశ్నించారు. దేశంలో సైద్ధాంతిక యుద్ధం జరుగుతోందని అన్నారు. ‘భారతీయులుగా మనమందరం ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అలా చేయడం లేదు. ఇతరుల సంప్రదాయాలపై దాడి చేస్తూ, వాళ్లను అగౌరవపరుస్తున్నాయి’ అని మండిపడ్డారు. నాగా ప్రజలకు తాను ఉన్నానని రాహుల్ భరోసా ఇచ్చారు.