అవి ఇరిగేషన్​ స్కీమ్​లు కాదు..కేసీఆర్​ స్కాములు : మోదీ

అవి ఇరిగేషన్​ స్కీమ్​లు కాదు..కేసీఆర్​ స్కాములు : మోదీ
  • కాంగ్రెస్​ గెలిస్తే.. బీఆర్​ఎస్​కు కార్బన్​ పేపర్​గా తయారైతది: మోదీ
  • తెలంగాణ యువతను బీఆర్​ఎస్​ సర్కార్​ దగా చేసింది
  • బీజేపీ అంటే కేసీఆర్​కు భయం.. కాంగ్రెస్​కు ఆయన ప్రాణమిత్రుడు
  • ఉద్యోగులకు టైమ్​కు జీతాలిస్తలేడు
  • దళితబంధు అని చెప్పి బీఆర్​ఎస్​ నేతలే పంచుకున్నరని ఫైర్​
  • కామారెడ్డి, తుక్కుగూడ సభల్లో ప్రధాని ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ స్కీముల పేరిట కేసీఆర్​ స్కాములు చేశారని ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. ఇరిగేషన్​ స్కీములను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంలుగా మార్చుకుందని దుయ్యబట్టారు. ‘‘ప్రజలకు డబ్బులు అవసరమైతే.. ఏటీఎం వద్దకు వెళ్తరు. బీఆర్ఎస్​కు  డబ్బులు అవసరమైతే కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకొస్తది” అని అన్నారు. ప్రాజెక్టుల వ్యయం పెంపు పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పటికీ ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, తెలంగాణ ప్రజల సొమ్ము కేసీఆర్​ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్లిందని అన్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ రెండూ ఒక్కటేనని.. కాంగ్రెస్​ అభ్యర్థులు గెలిస్తే బీఆర్​ఎస్​లోకి వెళ్తారని విమర్శించారు.

‘‘బీఆర్ఎస్ అంటే నిజాంషాహీ. కాంగ్రెస్ అంటే సుల్తాన్ షాహీ. రాష్ట్రంలో కాంగ్రెస్​ గెలిస్తే బీఆర్​ఎస్​కు కార్బన్​ పేపర్​గా మారుతుంది” అని  ఎద్దేవా చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తెలంగాణ యువతను బీఆర్ఎస్ ప్రభుత్వం దగా చేసిందని ఆయన మండిపడ్డారు. శనివారం కామారెడ్డిలో, మహేశ్వరంలోని తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభల్లో మోదీ మాట్లాడారు. తెలంగాణ యువ రాష్ట్రమని.. అయితే యువతకు వ్యతిరేకంగా బీఆర్​ఎస్​ పాలన సాగిస్తున్నదని అన్నారు. 

ఏండ్ల తరబడి టీఎస్​పీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతను బీఆర్ఎస్ మోసం చేసిందని, విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించి, యువత  భవిష్యత్తుతో ఆడుకుంటున్నదని ఫైర్​ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో  కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల  వేలాది మంది యువత ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలతో పాటు  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను ఓడించింది బీజేపీనేని తెలిపారు. బీజేపీ అంటే కేసీఆర్ కు భయం అని అన్నారు. 

బీఆర్​ఎస్​ సర్కార్​ కనీసం టైమ్​కు శాలరీలు కూడా ఇస్తలే

‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు వారి బిడ్డల భవిష్యత్ కోసం పనిచేస్తే.. మేము మీ (ప్రజల) బిడ్డల భవిష్యత్ కోసం పనిచేస్తం’’ అని ప్రధాని మోదీ చెప్పారు. ఈ రెండు పార్టీలకు కామారెడ్డి, తెలంగాణ ప్రజలు పూర్తిగా స్వస్తి పలకాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం సమయానికి శాలరీలు కూడా ఇవ్వడం లేదని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే టైమ్ కు శాలరీలు ఇస్తామని చెప్పారు. తెలంగాణను బీఆర్​ఎస్​ సర్కార్​ అవినీతిలో నంబర్ వన్‌గా నిలిపిందని మండిపడ్డారు. దళితబంధు అని చెప్పి బీఆర్​ఎస్​ నేతలకే ఇచ్చారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామని, అప్పుడు ధరలు తగ్గుతాయని తెలిపారు. 

ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ చేస్తున్నరు

బీఆర్ఎస్,  కాంగ్రెస్ ఇద్దరి మధ్యలో ఒక కామన్ ఒప్పందం ఉందని, ప్రజలను మోసం చేసేందుకు ఈ రెండు పార్టీలు  రకరకాలైన కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నాయని  మోదీ ఆరోపించారు. ‘‘టీఆర్ఎస్ ఆకస్మాత్తుగా  బీఆర్ఎస్ గా పేరు మార్చుకుంది. యూపీఏ కూటమిని ‘ఇండియా’ కూటమిగా మార్చుకున్నరు. అట్ల పేరు మార్చుకున్నంత మాత్రాన వారి గుణం, బుద్ధి, అవినీతి, పరిపాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు మారవు” అని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్,  పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి   పోటిచేస్తున్నారని, ఇక్కడే కాకుండా ఈ ఇద్దరు ఇతర చోట్ల కూడా పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. 

ఓటమి భయంతోనే  రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ప్రాణమిత్రుడని , ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే  ప్రారంభమైందని, గతంలో కాంగ్రెస్,  బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని ఆయన అన్నారు. మాదిగ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలను కాంగ్రెస్, బీఆర్ఎస్  అవమానించాయి. బీసీ లను దొంగలని కాంగ్రెస్​ అంటున్నది. 

ఆ మాటలు అన్న నేత బెయిల్ పై బయట తిరుగుతున్నరు” అని ఆయన మండిపడ్డారు. ఒకప్పుడు బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు ఎగతాళి చేశారని, ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అని తెలిపారు. తాము అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్దికోసం నిరంతరం కృషిచేస్తామని చెప్పారు. బీజేపీ ఏది చెప్తుందో అది చేసి తీరుతుందని, బీజేపీని గెలిపించి బీసీని సీఎం చేసుకుందామని అన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందని చెప్పారు. 

చెరుకు రైతుల కోసం ఇథనాల్ ఫ్యాక్టరీ

రైతులను కూడా బీఆర్ఎస్ మోసం చేసిందని మోదీ అన్నారు. రైతుల సంక్షేమానికి బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. పీఎం కిసాన్​ కింద తెలంగాణలో  40 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతున్నదని వివరించారు. ఇతర దేశాల్లో యూరియా ఒక బస్తా రూ. 2 వేల నుంచి రూ.3 వేలకు ఇస్తుంటే.. మన దేశంలో రూ. 300కు ఇచ్చి రైతులను అదుకుంటున్నామన్నారు. 

ఈ ఖరీఫ్ సీజన్​లో తెలంగాణ రైతుల నుంచి అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తామని చెప్పారు. వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మార్చేందుకు బయో గ్యాస్ ఫ్లాంటుగా ఏర్పాటు చేశామని.. రైతుల ఆదాయం పెంచేందుకు ఇథనల్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీంతో చెరుకు రైతులకు ప్రయోజనం జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. 

టీఆర్ఎస్ అకస్మాత్తుగా  బీఆర్ఎస్​గా పేరు మార్చుకుంది. యూపీఏ కూటమిని ‘ఇండియా’ కూటమిగా మార్చుకున్నరు. అట్ల పేరు మార్చుకున్నంత మాత్రాన వారి గుణం, బుద్ధి, అవినీతి, పరిపాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు మారవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలను కాంగ్రెస్, బీఆర్ఎస్  అవమానిం చాయి. బీసీలను దొంగలని కాంగ్రెస్​ అంటున్నది. ఆ మాటలు అన్న నేత బెయిల్​పై బయట తిరుగుతున్నరు.
- ప్రధాని మోదీ