శభాష్ ఆర్మీ..ఇది మనందరం గర్వించదగ్గ క్షణం: ప్రధాని మోదీ

శభాష్ ఆర్మీ..ఇది మనందరం గర్వించదగ్గ క్షణం: ప్రధాని మోదీ
  • ఆపరేషన్​ సిందూర్​పై ప్రధాని మోదీ స్పందన
  • ఇది మనందరం గర్వించదగ్గ క్షణం
  • పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి.. ఎలాంటి పొరపాట్లు జరగలేదు
  • ప్రతీకార దాడి విజయవంతంగా పూర్తిచేశామని వెల్లడి
  • కేబినెట్ ​మినిస్టర్స్​తో భేటీ.. ఆర్మీకి అభినందనలు

న్యూఢిల్లీ: ఆపరేషన్​ సిందూర్​పై ప్రధాని మోదీ స్పందించారు. ఇది మనందరం గర్వించదగ్గ క్షణం అని పేర్కొన్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారత ఆర్మీ​ ఆపరేషన్​ సిందూర్ నిర్వహించింది. పాకిస్తాన్​లోని 9 టెర్రర్​క్యాంపులపై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్​​ విజయవంతం అయిన నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్​భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా  మోదీ మాట్లాడారు.  నిర్దేశించిన ప్లాన్ ప్రకారమే ఆపరేషన్​నిర్వహించినట్టు చెప్పారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తిచేసినట్టు తెలిపారు. ముందస్తు సన్నాహాకాల ప్రకారమే స్ట్రిక్ట్​గా ఆర్మీ మిషన్​ను పూర్తిచేసిందని ప్రశంసించారు.  భారత త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌ఫోర్స్) అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్‌‌ను నిర్వహించాయని, సాయుధ బలగాల నైపుణ్యం, దేశ భద్రత పట్ల వారి నిబద్ధత ప్రశంసనీయమని మోదీ కొనియాడారు. భారత బలగాలు కచ్చితమైన లక్ష్యాలు ఛేదించడం మనమంతా గర్వించదగని విషయం అని మోదీ చెప్పగానే కేబినెట్​ సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

సైన్యానికి మోదీ ప్రశంస

పాకిస్తాన్​ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్‌‌లో 4 చోట్ల, పాక్ ఆక్రమిత కశ్మీర్‌‌లో 5 చోట్లు సాయుధ బలగాలు దాడులు జరిపిన తీరును మోదీ వివరించారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను కచ్చితమైన ప్రణాళికతో ధ్వంసం చేసినందుకు సైనిక దళాలకు అభినందనలు తెలిపారు. యావత్తు దేశం మనవైపు చూస్తున్నదని, భారత ఆర్మీ మనకు గర్వకారణంగా నిలిచిందని అన్నారు. పహల్గాంలో 26 మంది పౌరుల మరణానికి కారణమైన ఉగ్రదాడికి ఈ ఆపరేషన్ ప్రతీకార చర్య అని, దేశ భద్రతకు ఎలాంటి రాజీ లేకుండా ఉగ్రవాదంపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.  ఈ విజయం దేశానికి గర్వకారణమని, సైనికుల సమర్థత,  దేశభక్తిని ప్రతి భారతీయుడూ గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఉగ్రవాదంపై పోరులో ప్రధాని నాయకత్వానికి, సైన్యానికి కేబినెట్ మంత్రులు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. టేబుళ్లపై కొడుతూ.. ప్రభుత్వ చర్యను స్వాగతించారు. టెర్రరిజంపై పోరులో యావత్తు దేశం ప్రధాని మోదీకి, సైనిక వ్యవస్థకు అండగా  నిలుస్తుందని చెప్పారు.