
మోదీ పాలనలో ధనవంతులు మాత్రమే బాగుపడ్డారన్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. వ్యాపారుల నుంచి డొనేషన్లు తీసుకోవడం.. బీజేపీ బలోపేతం చేయడమే మోదీకి తెలుసంటూ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో తన సోదరుడు రాహుల్ గాంధీకి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీ గత 10 సంవత్సరాలుగా వారణాసి నుంచి ఎంపీగా ఉన్నారు, కానీ ఆయన అక్కడ ఏ గ్రామానికి కూడా వెళ్లలేదన్నారు. మాజీ ప్రధానులు, కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీలను ప్రస్తావిస్తూ వారు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. దేశంలోని బొగ్గు, విద్యుత్, ఓడరేవులు, విమానాశ్రయాలు అన్నీ ప్రధాని మిత్రుల వద్ద ఉన్నాయని ప్రియాంక ఆరోపించారు. ప్రజల మధ్య విధ్వేషాలు పెంచడమే బీజేపీ విధానమని చెప్పారు. ఇండియా కూటమితోనే రాజ్యాంగం, రిజర్వేషన్లు సురక్షితంగా ఉంటాయని చెప్పారు ప్రియాంక గాంధీ.