ప్రధాని మోడీకి ఏ లక్ష్యం లేదు

ప్రధాని మోడీకి ఏ లక్ష్యం లేదు

బీహార్: ప్రధాని మోడీకి ఏ లక్ష్యంలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బీహార్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ .. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలపై చర్చించారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. డాలర్ తో పోలిస్తే రోజు రోజుకి రూపాయి విలువ పడిపోతుందని.. ప్రధాని మోడీ పాలనలో ప్రజలు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే కరెంట్ కోతలున్నాయని.. మంచినీళ్లు లేని పరిస్థితి ఉందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తుందన్న కేసీఆర్.. ధరలు పెరగడంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

ప్రతిపక్షాలు ఉన్న ప్రభుత్వాలను పడగొట్టడమే ప్రధాని మోడీ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మోడీ హయాంలో విదేశాలకు సారీ చెప్పాల్సిన పని ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ మత ద్వేషాలను సృష్టిస్తుందన్న కేసీఆర్.. బీజేపీ ముక్త్ భారత్ తోనే దేశాన్ని ముందుకు తీసుకుపోతామని తెలిపారు. విపక్షాలతో కలిసి బీజేపీ ముక్త్ తో భారత్ కు కృషి చేస్తామన్న కేసీఆర్.. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం.. చైనా దేశం నుంచే ఎక్కువ దిగుమతులు చేసుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. 

థర్డ్ ఫ్రంట్ కాదు... మెయిన్ ఫ్రంట్..

నితీష్, నేను కలిసి విపక్షాలు ఏకం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. బీజేపీ తీరు ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా  ఉందన్నారు. దేశంలో వచ్చేది థర్డ్ ఫ్రంట్ కాదు... మెయిన్ ఫ్రంట్ అని చెప్పారు. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని, అందుకే దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని, ఈ విషయం గురించి నితీశ్‌తో కూడా చర్చించామని చెప్పారు. దేశానికి రొటీన్ ప్రభుత్వాలు వద్దని, భారత్‌ను మార్చే ప్రభుత్వం రావాలన్నారు. బీజేపీ అబద్ధాలతోనే పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ పరిణామాల క్రమంలో విపక్షాలను ఏకం చేసే విషయమై నితీశ్‌తో చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు.