ఇండియా ఎల్లప్పుడూ శాంతి మార్గంలోనే

ఇండియా  ఎల్లప్పుడూ శాంతి మార్గంలోనే
  •  జర్మనీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ
  • యుద్ధాన్ని ముగించాలని విజ్ఞప్తి

బెర్లిన్: ఉక్రెయిన్‌‌పై రష్యా చేస్తున్న దండయాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో ఏ దేశమూ విజయం సాధించలేదని చెప్పారు. ఇండియా శాంతిని కోరుకుంటుందని మరోసారి స్పష్టంచేశారు. యుద్ధాన్ని ముగించాలని కోరారు. మూడు రోజుల యూరప్ టూర్​లో భాగంగా సోమవారం జర్మనీ రాజధాని బెర్లిన్‌‌కు ప్రధాని చేరుకున్నారు. మధ్యాహ్నం ఇండియా- జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్‌‌(ఐజీసీ) ఆరో ఎడిషన్‌‌లో జర్మనీ చాన్స్‌‌లర్ ఓలాఫ్ స్కాల్జ్‌‌తో కలిసి పాల్గొన్నారు. ప్రతినిధుల స్థాయి చర్చలకు ముందు ఇద్దరు నేతలు భేటీ అయి.. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చలు జరిపారు. ఐజీసీ మీట్‌‌‌‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్, సస్టెయినబుల్ ఎనర్జీ భాగస్వామ్యంపై మోడీ, స్కోల్జ్ సంతకం చేశారు.

ప్రధానికి ఘన స్వాగతం

ప్రధాని మోడీకి బెర్లిన్‌‌లో ఘన స్వాగతం లభిం చింది. బ్రాండెన్ బర్గ్ గేట్ వద్ద ఎన్నారైలు మోడీకి వెల్కమ్ చెప్పారు. డ్యాన్స్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఎదురుచూసిన ఇండియన్లు.. ప్రధాని రాగానే ‘వందే మాతరం’.. ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. తన కోసం దేశభక్తి పాటపాడిన అశుతోష్ అనే అబ్బాయిని శభాష్ అని మోడీ మెచ్చుకున్నారు. పిల్లాడు పాడుతున్నంతసేపు చిటికెలు వేస్తూ కనిపించారు. తన బొమ్మ గీసిన మాన్యా మిశ్రా అనే అమ్మాయితో ఫొటో దిగారు. బొమ్మపై సంతకంచేసి ఇచ్చారు. ‘‘బెర్లిన్​లో ల్యాండ్ అయ్యా.. ఎన్నారైలు నన్ను ఆహ్వానించేందుకు వచ్చారు. వాళ్లను కలవడం, వారితో మాట్లాడటం అద్భుతమనిపించింది. ఎన్నారైల విజయాలకు  ఇండియా గర్వపడుతోంది. నా పర్యటన ఇండియా, జర్మనీ మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. మోడీ ప్రధాని అయ్యాక జర్మనీలో ఐదోసారి పర్యటిస్తున్నారు. 3, 4 వ తేదీల్లో మోడీ డెన్మార్క్, ఫ్రాన్స్‌‌లో పర్యటిస్తారు