Narendra Modi : ఇయ్యాల హైదరాబాద్ కు ప్రధాని మోడీ

 Narendra Modi : ఇయ్యాల హైదరాబాద్ కు ప్రధాని మోడీ

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాష్ట్రానికి రానున్నారు. పరేడ్​ గ్రౌండ్స్​లో జరిగే బహిరంగ సభలో రూ.11,355 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, పరేడ్ గ్రౌండ్స్​ సభ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

శనివారం ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో మోడీ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 2 గంటల పాటు ఆయన హైదరాబాద్​లో బిజీబిజీగా గడపనున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి 11.45కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు చేరుకుని సికింద్రాబాద్–-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.05కు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి 12.15కు పరేడ్ గ్రౌండ్​కు చేరుకుంటారు. ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలకనున్నారు. 12.20 నుంచి 12.25 వరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, 12.25 గంటల నుంచి 12.30 వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు. సీఎం కేసీఆర్ హాజరైతే 12.30 నుంచి 12.37 వరకు ఆయన మాట్లాడనున్నారు. 12.37 నుంచి 12.50 వరకు వివిధ అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు భూమి పూజ చేస్తారు. రూ.1,410 కోట్లతో పూర్తి చేసిన సికింద్రాబాద్-–మహబూబ్ నగర్ డబ్లింగ్ లైన్​ను జాతికి అంకితం చేస్తారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా 13 కొత్త సర్వీసులను ప్రారంభిస్తారు. రూ.7,864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 6 జాతీయ రహదారి ప్రాజెక్టులకు భూమిపూజ చేస్తారు. రూ.1,366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్​లో చేపట్టనున్న వివిధ పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం అభివృద్ధి పనులు, వాటి ప్రయోజనాలకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్​ను ప్రధాని తిలకిస్తారు. 12.50 నుంచి 1.20 వరకు సభలో మోడీ ప్రసంగిస్తారు. సభ ముగిశాక పరేడ్​ గ్రౌండ్స్​ నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోని, 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి వెళ్తారు.

వాటర్​ ప్రూఫ్​ టెంట్లు.. ఎల్ఈడీ స్క్రీన్లు

సభా స్థలిలో వర్షం పడినా ఇబ్బందులు కలుగకుండా జర్మన్ టెంట్లను వేశారు. సభా ప్రాంగణంలో మొత్తం లక్ష కుర్చీలు వేశారు. ప్రధాని ప్రసంగాన్ని దగ్గరగా చూడటానికి వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. జంట నగరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచే బేగంపేట నుంచి మోడీ ప్రయాణించే మార్గం.. సికింద్రాబాద్  రైల్వేస్టేషన్, పరేడ్ గ్రౌండ్స్​ను ఎస్ పీజీ, ఎన్ఎస్​జీ బలగాలు తమ అధీనంలోకి తీసుకుని జల్లెడ పట్టాయి. సభా ఏర్పాట్ల పరిశీలనపరేడ్ ​గ్రౌండ్స్​లో మోడీ సభ ఏర్పాట్లను కిషన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. సభకు లక్ష మంది జనం వస్తారని అంచనా వేస్తున్న బీజేపీ నేతలు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల నుంచి జనాన్ని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిటీలో బీజేపీ కార్పొరేటర్లకు జన సమీకరణ బాధ్యత అప్పగించారు. బస్సులు, రైళ్ల ల్లో కూడా జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసమీకరణపై శుక్రవారం పార్టీ ఆఫీసులో నేతలు చర్చించారు.