యూపీఏతో అధికారం పంచుకున్నా..తమిళనాడు డెవలప్ కాలే : మోదీ

యూపీఏతో అధికారం పంచుకున్నా..తమిళనాడు డెవలప్ కాలే : మోదీ
  • రాష్ట్రాన్ని ఎన్​డీఏ సర్కార్ అభివృద్ధి చేసింది
  •     కేంద్ర స్కీంలపై  ప్రజలకు రాష్ట్రం అవగాహన కల్పించడం లేదు
  •     రాష్ట్ర అభివృద్ధికి మాత్రం మేం కట్టుబడి ఉన్నాం
  •     రూ.17వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన

తూతుకూడి (తమిళనాడు): అభివృద్ధిలో తమిళనాడు ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మోడర్న్ కనెక్టివిటీ బాగా పెరిగిందని తెలిపారు. ఎన్​డీఏ హయాంలోనే రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా మెరుగుపడిందని చెప్పారు. సముద్ర రంగం అభివృద్ధి చెందితే.. తమిళనాడు వంటి తీర ప్రాంత రాష్ట్రాలు కూడా ఎంతో డెవలప్ అవుతాయని అన్నారు. దీని కోసం కేంద్రం తనవంతు కృషి చేస్తున్నదని వివరించారు. బుధవారం రూ.17,300 కోట్లు విలువ చేసే పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. దేశంలోని మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ వాటర్ వే నౌకను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ‘తమిళనాడులోని న్యూస్ పేపర్లు, టీవీల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను హైలైట్ చేయడం లేదు. కేంద్రం కోరినా రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదు. అయినా.. మేము రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అని మోదీ నొక్కి చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా డెవలప్​మెంట్

‘నేను ఏంమాట్లాడినా రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. అభివృద్ధే లక్ష్యంగా మాట్లాడతాను. తమిళనాడు, దేశ ప్రజలకు నేనొక నిజం చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటది. కానీ.. అదేంటో చెప్పాలి. నేను ప్రారంభించే ఏ ప్రాజెక్ట్ అయినా స్థానికులకు ఉపయోగపడేలా ఉంటుంది. యూపీఏ హయాంలో తమిళనాడులో ఉన్న అధికార పార్టీ కేంద్రంలో పవర్ పంచుకున్నది. అయినా.. రాష్ట్రాన్ని యూపీఏ సర్కార్ పట్టించుకోలేదు’ అని డీఎంకేను  ఉద్దేశిస్తూ పరోక్షంగా మోదీ విమర్శించారు.

రాష్ట్రంలో కనెక్టివిటీ మెరుగుపర్చాం

పదేండ్లలో తమిళనాడులో 1,300 కి.మీ. రైల్వే ఇన్​ఫ్రాస్ట్రక్చర్, 2 వేల కి.మీ. రైల్వే లైన్​ను ఎలక్ట్రిఫికేషన్ చేశామని మోదీ తెలిపా రు. ‘రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలు కల్పించాం. రైల్వే, హైవేస్, వాటర్ వేస్ మార్గాన్ని డెవలప్ చేశాం. పరిశ్రమల స్థాపనకు కృషి చేశాం. దేశంలో నే తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ వే నౌకను ప్రారంభించుకున్నాం’ అని తెలిపారు.