తమిళ సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త టెర్మినల్.. చెన్నైలో ప్రారంభించనున్న మోడీ

 తమిళ సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త టెర్మినల్..  చెన్నైలో ప్రారంభించనున్న మోడీ

చెన్నై ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తైంది. ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని ట్విట్టర్ లో పంచుకున్నారు. ‘మౌళిక సదుపాయాల రూపకల్పనలో ఈ భవన నిర్మాణం కీలక పాత్ర వహిస్తుంది. కనెక్టివిటీని పెంచడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుంది’’ అంటూ మోడీ ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. 

2,20,972 చదరపు మీటర్ల స్థలంలో ఈ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. ఇందుకోసం దాదాపు రూ. 1260 కోట్లను వెచ్చించారు. దీని రూపకల్పనలో కోలం వంటి దక్షిణ భారత సంప్రదాయం ఉట్టిపడే డిజైన్ ను ఉపయోగించారు. తమిళనాడులో పెరుగుతున్న విమాన రాకపోకల నేపథ్యంలో ఇది కీలకం కానుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘‘ప్రయాణికులకు హై క్వాలిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అందించాలనే ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం. ఏడాదికి 35 మిలియన్ల  ప్రయాణికులకు సేవలు అందించగల సామర్థ్యం దీని సొంతం. ఈ అధునాతన సదుపాయాలు విమాన ప్రయాణాలను మరింత మెరుగుపరచనుంది’’ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. 

పలు అధికారిక కార్యక్రమాల్లో భాగంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మోడీ పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 8న హైదరాబాద్ చేరుకోనున్నారు. సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

https://twitter.com/narendramodi/status/1643824026043797505