దేశ భవిష్యత్తును సిటీలే నిర్ణయిస్తాయి

దేశ భవిష్యత్తును సిటీలే నిర్ణయిస్తాయి

గుజరాత్​లోని గాంధీనగర్ ‑ ముంబై మధ్య వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలు, అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్‑1ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. రైల్వే సిబ్బంది కుటుంబసభ్యులు, యువతతో కలిసి రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారితో ప్రధాని ముచ్చటించారు. అనంతరం అహ్మదాబాద్​లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. 

అహ్మదాబాద్: దేశ భవిష్యత్తును సిటీలే నిర్ణయిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘మారుతున్న కాలం, అవసరాలకు అనుగుణంగా సిటీలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. అందుకే సిటీల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టి నిధులు ఖర్చు చేస్తున్నాం. ఎందుకంటే అవి రానున్న 25 ఏండ్లలో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాయి” అని ఆయన చెప్పారు. శుక్రవారం రెండో రోజు గుజరాత్ లో మోడీ పర్యటించారు.

గాంధీనగర్ – ముంబై వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు, అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ 1ను ప్రారంభించారు. అనంతరం అహ్మదాబాద్ లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. దేశంలోని నగరాలను ఆధునికీకరించడంతో పాటు గ్లోబల్ బిజినెస్ డిమాండ్ కు అనుగుణంగా కొత్త సిటీలను నిర్మిస్తున్నామని మోడీ చెప్పారు. రానున్న 25 ఏండ్లలో అహ్మదాబాద్, సూరత్, వడోదర, భోపాల్, ఇండోర్, జైపూర్ సిటీలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిపారు. నగరాల్లో అభివృద్ధి కేవలం కనెక్టివిటీకే పరిమితం కావడం లేదని.. మౌలిక వసతులతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని, శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ‘‘ట్విన్ సిటీల అభివృద్ధికి గాంధీనగర్–అహ్మదాబాద్ పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పటివరకు మనం న్యూయార్క్–న్యూజెర్సీ ట్విన్ సిటీల గురించే విన్నాం. ఇకపై ఇందులో మన దేశం వెనుకబడి ఉండదు. గుజరాత్ లో మరిన్ని ట్విన్ సిటీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం” అని చెప్పారు. నగరాల్లో ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్​లను తగ్గించేందుకు, రైళ్ల వేగాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 7 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టామన్నారు. 8 ఏండ్లలో 12కు పైగా సిటీల్లో మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించామని చెప్పారు. 

వందే భారత్ రైలులో మోడీ ప్రయాణం..  

మోడీ మొదట గాంధీనగర్ స్టేషన్​లో గాంధీనగర్–ముంబై వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. రైల్వే సిబ్బంది కుటుంబసభ్యులు, వుమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్, యువతతో కలిసి అందులో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించారు. కలుపూర్ స్టేషన్​లో రైలు దిగిన మోడీ.. అక్కడ అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ 1ను ప్రారంభించారు. థాల్తేజ్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. కాగా, గాంధీనగర్ నుంచి ముంబైకి వందే భారత్ ట్రైన్ ఐదున్నర గంటల్లోనే 
వెళ్తుందని మోడీ చెప్పారు. 

కాన్వాయ్​ ఆపి అంబులెన్స్​కు దారి.. 

మోడీ తన కాన్వాయ్​ని ఆపి అంబులెన్స్ కు దారి ఇచ్చారు. అహ్మదాబాద్​లో పబ్లిక్ ర్యాలీలో మాట్లాడిన తర్వాత గాంధీనగర్ లోని రాజ్ భవన్ కు మోడీ బయలుదేరారు. ఆ టైమ్​లో తన కాన్వాయ్ వెనుక అంబులెన్స్ వస్తున్న విషయాన్ని ఆయన గ్రహించారు. వెంటనే తన కాన్వాయ్​ని రోడ్డు పక్కన ఆపించారు. అంబులెన్స్ వెళ్లిన తర్వాత తిరిగి బయలుదేరారు. ఈ వీడియోను బీజేపీ మీడియా సెల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.