ఢిల్లీ -డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ కు మోడీ శంకుస్థాపన

ఢిల్లీ -డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ కు మోడీ శంకుస్థాపన

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు  ప్రధాని మోడీ  ఇవాళ( శనివారం) ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో శంకుస్థాపన చేశారు. రూ.8,300 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. దీనితో పాటు రూ18,000 కోట్లతో ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేయనున్న వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు మోడీ. గత ఐదేళ్లలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్రం లక్ష కోట్లకు పైగా ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇవాళ ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులకు రూ.18,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని తెలిపారు. అధునాతన మౌలిక వసతుల కల్పనకు రూ.100 లక్షల కోట్లు పెట్టుబడి లక్ష్యంగా దేశం పయనిస్తోందని అన్నారు. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ కారిడార్ సిద్ధమైన తర్వాత ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణించే సమయం సగానికి సగం తగ్గుతుందని చెప్పారు.

మన పర్వతాలు, సంస్కృతి కేవలం మన విశ్వాసానికి సంబంధించిన అంశాలే కాకుండా దేశ భద్రతకు పెట్టని కోటలన్నారు ప్రధాని మోడీ. పర్వత ప్రాంతాల్లో నివసించే వారు సులభంగా జీవనయానం సాగించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న వారు ఇందుకు సంబంధించి ఎలాంటి విధానపరమైన వ్యూహం రూపొందించడపోవడం దురదృష్టకరమని అన్నారు. 2007 నుంచి 2014 మధ్య కాలంలో ఉత్తరాఖండ్‌లో రూ.600 కోట్లతో కేవలం 288 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణం జరుపగా, తమ ప్రభుత్వం 7 ఏళ్ల పాలనలో ఉత్తరాఖండ్‌లో రూ .12,000 కోట్లతో 2,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం జరిపిందన్నారు ప్రధాని మోడీ.