ఆ రోజు ఫ్రాన్స్ మినీ ఇండియా అవుతుంది : మోడీ

ఆ రోజు ఫ్రాన్స్ మినీ ఇండియా అవుతుంది : మోడీ

కొత్త ఇండియా నిర్మిస్తున్నాం కాబట్టే ఇండియాలో ప్రజలు తమకు మరోసారి భారీ విజయం అందించారని ఫ్రాన్స్ లో చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ప్యారిస్ నగరం… యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో భారతీయ ప్రజలతో ఏర్పాటుచేసిన భారీ సభలో మాట్లాడారు మోడీ. ప్రధాని రాక సందర్భంగా.. ప్రవాస భారతీయులు మోడీ .. మోడీ అనే నినాదాలు చేశారు. ఈ స్లోగన్స్ తో ఆడిటోరియం దద్దరిల్లింది.

ఇండియా – ఫ్రాన్స్ దేశాలు.. పరస్పర సహకారంతో ప్రగతి వైపు పరుగులు పెడుతున్నాయని మోడీ చెప్పారు. ఇన్-ఫ్రా(ఇండియా – ఫ్రాన్స్) కలయిక చాలా బలమైనదని చెప్పారు. సోలార్, సోషల్, టెక్నాలజీ సహా.. పలు రంగాల్లో రెండు దేశాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు.

ఫుట్ బాల్.. గోల్.. మోడీ

“ఫుట్ బాల్ ను బాగా ప్రేమించే ఓ దేశానిని నేను వచ్చాను. ఇక్కడ గోల్ అంటే అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోల్ కు మేం కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అలా.. లక్ష్యాలు పెట్టుకున్నాం కాబట్టే… ఇన్ని దశాబ్దాల్లో ఏ ప్రభుత్వం చేయని పనులను ఐదేళ్లలో మేం చేసి చూపించాం ” అని అన్నారు మోడీ.

“గడిచిన ఐదేళ్లలో.. అవినీతి, బంధుప్రీతి, ప్రజా ధనం లూటీ, ఉగ్రవాదం అంశాల్లో మునుపెన్నడూ లేనట్టుగా కఠిన నిర్ణయాలు తీసుకుని .. కొత్త ఇండియా వైపు అడుగులు వేశాం. రెండోసారి అధికారంలోకి వచ్చాక… 75 రోజుల్లోనే మరిన్ని బలమైన నిర్ణయాలు తీసుకున్నాం. ముస్లిం మహిళల మెడపై కత్తిలా ఉన్న ట్రిపుల్ తలాక్ ను తొలగించాం ” అని చెప్పారు ప్రధాని.

గణేష్ చతుర్థిని ఫ్రాన్స్ లోనూ ఘనంగా నిర్వహిస్తుండటం గొప్పవిషయం అన్నారు మోడీ. ప్యారిస్ సాంస్కృతిక క్యాలెండర్ లో గణేష్ చతుర్థికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఆ రోజున ఫ్రాన్స్ .. మినీ ఇండియాను గుర్తుచేస్తుందని అన్నారు. గణపతి బప్పా మోరియా నినాదాలు మార్మోగుతాయన్నారు ప్రధాని.