
- ఇండియాపై ఒక్క టెర్రర్ అటాక్ జరిగినా వదలం
- పాకిస్తాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
- టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నోళ్లను కూకటివేళ్లతో పీకి పడేస్తం
- న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడితే సహించం
- పాక్‌తో ఎలాంటి చర్చలు జరిపినా అది టెర్రరిజంపైనే..
- ఏం మాట్లాడినా.. అది పీవోకేపైనే ఉంటది
- ఆపరేషన్ సిందూర్‌తో ఇండియా సత్తా చాటినం
- వంద మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినం
- పాక్ కాళ్ల బేరానికి వస్తేనే సీజ్‌ఫైర్‌కు అంగీకరించాం
- ఈ యుగం యుద్ధాలది కాదు.. టెర్రరిజానిది అంతకన్నా కాదు..
న్యూఢిల్లీ: ఇండియాపై ఇక నుంచి ఒక్క టెర్రర్ అటాక్ జరిగినా అంతు చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న అందరినీ కూకటివేళ్లతో పీకి పడేస్తామని వార్నింగ్ ఇచ్చారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ఆయన తొలిసారి సోమవారం జాతినుద్దేశించి మాట్లాడారు. న్యూక్లియర్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడితే సహించేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇండియా నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు.
పాకిస్తాన్‌తో ఇక నుంచి ఎలాంటి చర్చలు జరిపినా.. అది టెర్రరిజంపైనే ఉంటాయని, ఏం మాట్లాడినా.. అది కేవలం పీవోకే అంశమే ఉంటుందని తేల్చి చెప్పారు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలబోమన్నారు. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్ కు రుచి చూపించామని తెలిపారు. టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నవాళ్లను అస్సలు వదలబోమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఇండియా జరిపిన దాడుల్లో టెర్రరిస్టులు చనిపోతే.. వారి అంత్యక్రియలకు ఆర్మీ అధికారులు అటెండ్ అయ్యారని ఫైర్ అయ్యారు. టెర్రరిజాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నదనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు.
టెర్రరిస్టులకు పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వం అన్ని సౌలత్లు కల్పిస్తున్నదని మోదీ మండిపడ్డారు. ‘‘టెర్రరిజాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నది. ఏదో ఒక రోజు ఆ టెర్రరిజమే.. పాకిస్తాన్‌ను నామరూపాల్లేకుండా చేస్తది. ఈ యుగం యుద్ధాలది కాదు.. ఉగ్రవాదానిది అంతకన్నా కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు, దాడులకు ఇండియా వెనుకాడదు. ఉగ్రవాదులకు అన్నం పెడ్తున్న వాళ్లెవరినీ వదిలిపెట్టం. పాకిస్తాన్ బతికి బట్టకట్టాలంటే.. వెంటనే టెర్రరిస్టుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నామరూపాల్లేకుండా చేయాలి. టెర్రర్, టాక్ (చర్చలు) రెండూ ఒకేసారి జరగవు. టెర్రర్, ట్రేడ్ రెండూ కలిసి నడ్వలేవు. రక్తం, నీళ్లు కూడా ఒకేసారి ప్రవహించలేవు. ఆపరేషన్ సిందూర్‌లో ఆయుధ సంపత్తిని ప్రదర్శించాం. మేడిన్ ఇండియా రక్షణ వ్యవస్థలు ఎంత బలమైనవో.. ఎంత శక్తిమంతమైనవో చాటాం’’ అని మోదీ అన్నారు.
పహల్గాంలో అమాయకులను చంపేసిన్రు
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులను చంపేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మతం అడిగి మరీ చంపేశారని తెలిపారు. కుటుంబ సభ్యులు, పిల్లల ముందే దారుణంగా హత్య చేశారన్నారు. ఈ ఘటన టెర్రరిస్టుల క్రూరత్వానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. ‘‘దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు టెర్రరిస్టులు కుట్ర పన్నారు. పహల్గాం ఘటన.. నన్ను వ్యక్తిగతంగా ఎంతో బాధపెట్టింది. టెర్రరిస్టుల దాడిని దేశంలోని ప్రతి ఒక్కరూ ఖండించారు.
అన్ని వర్గాలు, రాజకీయ నేతలు, పార్టీలు ఒక్కటై టెర్రరిజానికి వ్యతిరేకంగా తమ స్వరం వినిపించాయి. టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఉగ్రవాదులను మట్టిలో కలిపేసేందుకు సైనికులకు మేము స్వేచ్ఛ ఇచ్చాం. మన అమ్మ, అక్కా చెల్లెళ్ల సిందూరాన్ని తుడిచేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు ప్రతి ఒక్క టెర్రరిస్ట్, ఉగ్రవాద సంస్థలకు తెలిసి వచ్చింది’’ అని మోదీ అన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ పేరు కాదు.. ప్రతిజ్ఞ
‘ఆపరేషన్ సిందూర్’ అంటే పేరు మాత్రమే కాదని.. మన అక్కాచెల్లెళ్లు, తల్లుల ఆవేదన, ప్రతిజ్ఞ అని ప్రధాని మోదీ అన్నారు. ‘‘మే 6వ తేదీ అర్ధరాత్రి దాటాక.. 7వ తేదీ తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ సత్తా ఏంటో ప్రపంచం మొత్తం చూసింది. మన ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు, ట్రైనింగ్ సెంటర్లపై మెరుపు దాడులు చేసింది. ఇండియా.. ఇంత భీకరమైన దాడులు చేస్తదని టెర్రరిస్టులు కలలో కూడా అనుకోలేదు. దేశం మొత్తం ఏకమైనప్పుడు.. నేషన్ ఫస్ట్ అనే భావన అందరిలో వచ్చినప్పుడు.. ఇలాంటి సంచలన నిర్ణయాలే దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయి. పాక్‌లోని టెర్రరిస్టు క్యాంపులను మన మిసైళ్లు, డ్రోన్లు ధ్వంసం చేశాయి.
ఈ దాడులతో టెర్రరిస్టుల ముఖాల్లో భయం అంటే ఏంటో కనిపించింది. బహవాల్పూర్, ముర్కిడేలోని టెర్రరిస్ట్ క్యాంపులను నామరూపాల్లేకుండా చేశాం. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన పెద్ద పెద్ద ఉగ్రవాద దాడులకు ఈ రెండు క్యాంపులతో సంబంధం ఉండేది. ఇక్కడి నుంచి బయల్దేరిన టెర్రరిస్టులే.. ప్రపంచ వ్యాప్తంగా మారణహోమం సృష్టించారు. ఈ రెండు క్యాంపులు గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీలుగా మారాయి’’అని మోదీ అన్నారు.
సైంటిస్టులకు నా సెల్యూట్
ఇండియాతో తలపడలేమని తెలుసుకున్న పాకిస్తాన్ చివరికి కాళ్ల బేరానికి వచ్చిందని మోదీ తెలిపారు. టెర్రరిజంపై షరతుల మేరకే చర్చలు ఉంటాయని తెలిపారు. ‘‘ఈరోజు బుద్ధ పౌర్ణమి. భగవంతుడు బుద్ధుడు.. శాంతికి దారి చూపించారు. శాంతి మార్గం కూడా శక్తితో కూడుకున్నదే. ప్రతి మనిషి శాంతి, సమృద్ధి వైపు అడుగులు వేయాలి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేయాలి. దీని కోసం ఇండియా మరింత శక్తిమంతం కావాలి. ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన జవాన్ల త్యాగాలు వృథా పోవు’’అని మోదీ అన్నారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, సైంటిస్టులకు ప్రతి భారతీయుడి తరఫున తాను సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు.
పాకిస్తాన్‌కు షాకిచ్చాం
పహల్గాం టెర్రర్ దాడి యావత్ దేశాన్ని కలచివేసింది. మన ఆడబిడ్డల సిందూరాన్ని తొలగించిన టెర్రరిస్టులకు ‘ఆపరేషన్ సిందూర్’తో మన సైన్యం గట్టి గుణపాఠం చెప్పింది.. టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వంద మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఆ దేశంలోని ఎయిర్‌బేస్‌లను నేలమట్టం చేసింది. ఇదీ మన సైన్యం సత్తా! పహల్గాం దాడిని ఖండించాల్సింది పోయి.. తిరిగి ఇండియాపైనే దాడికి పాకిస్తాన్ దుస్సాహసం చేసింది. మన స్కూళ్లు, కాలేజీలు, గుడులు, గురుద్వారాలు, సామాన్యుల ఇండ్లపై డ్రోన్లు, మిసైల్స్‌తో తెగబడింది. కానీ, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ముందు అవన్నీ గాల్లోనే తుక్కుతుక్కయ్యాయి.
దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చారు
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. మే 10న మధ్యాహ్నం మన డీజీఎంవోతో పాక్ ఆర్మీ చర్చలు జరిపింది. మళ్లీ ఉగ్రవాద చర్యలకు పాల్పడబోమని, కాల్పులు జరపబోమని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలని ప్రాధేయపడింది. కానీ.. మేము ఒప్పుకోలేదు. పాకిస్తాన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే చర్చించుకుని సీజ్ ఫైర్‌కు ఓకే చెప్పాం. అప్పటికే ఉగ్రవాద స్థావరాలను మనం ధ్వంసం చేశాం. పాకిస్తాన్ మళ్లీ తోకజాడిస్తే సహించేది లేదు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుంది. భారత త్రివిధ దళాలు బార్డర్లో అలర్ట్‌గా ఉన్నాయి.