
- ఇందుకు రాష్ట్రాల టాస్క్ ఫోర్స్ ఏర్పాటవ్వాలి
- 35 పంట రకాలను ఆవిష్కరించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: 2023ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా యూఎన్ఓ ప్రకటించిన క్రమంలో భారతీయ తృణధాన్యాలను ఇప్పటినుంచే ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన 35 కొత్త పంట రకాలను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఐసీఏఆర్, పలు కేంద్ర, రాష్ట్ర అగ్రి వర్సిటీలు, కృషీ విజ్ఞాన్ కేంద్ర ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని వీటిని జాతికి అంకితం చేశారు. ‘‘మిల్లెట్లకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. అందుకనుగుణంగా ఉత్పత్తినీ పెంచుకోవాలి. అందుకు సైన్స్, రీసెర్చ్, టెక్నాలజీ సాయం తీసుకోవాలి. ఇందుకోసం రాష్ట్రాలు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవాలి. నేను సీఎంగా గుజరాత్ లో చేపట్టిన పలు చర్యలు గొప్ప ఫలితాలిచ్చాయి. హై క్వాలిటీతో కూడిన సాగు డేటా సేకరణ తదితరాలకు డ్రోన్లు, సెన్సర్ల వాడకాన్ని పెంచాలి” అన్నారు.
ఇప్పటికే 1300కు పైగా కొత్త పంటలు..
‘‘మనమిప్పటికే 1,300కు పైగా కొత్త పంట రకాలను అభివృద్ధి చేసుకున్నాం. ఈ రోజు 35 కొత్త రకాలను రైతులకు అంకితం చేసుకుంటున్నాం. వాతావరణ మార్పులు, పౌష్టికాహార లోపం వంటి సమస్యల పరిష్కారంలో ఇది మరో ముందడుగు. నీటి ఎద్దడి, పంట రోగాల వంటి పలు సమస్యలను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించారు. వాతావరణ మార్పులతో వ్యవసాయ రంగంపై పడే బయో స్ట్రెస్ ను అధిగమించడం, రైతు ఆదాయాన్ని పెంచే మార్గాలపై ఎన్ఐబీఎస్ టీ రీసెర్చ్ చేయనుంది” అని వివరించారు.
వాతావరణ మార్పులతో..
‘‘వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తికి వాతావరణ మార్పులు గండి కొడుతున్నాయి. రైతులకు భారీ నష్టాలు మిగులుస్తున్నాయి. పర్యావరణ వ్యవస్థకే పెను సవాలుగా మారాయి. కొత్త తరహా కీటకాలు, రోగాలు, మహమ్మారులు జనారోగ్యానికి, పశు సంపదకు, పంటలకు పెద్ద సమస్యగా మారాయి” అని ప్రధాని ఆందోళన వెలిబుచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి కలసికట్టుగా ప్రయత్నించాలని, పరిశోధనలను పెంచాలని పిలుపునిచ్చారు.