
- బిహార్ లోని రాజ్ గిర్ లో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
- నలంద వర్సిటీ దేశ సంస్కృతికి, వారసత్వానికి చిహ్నం
- అగ్నికీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు.. కానీ జ్ఞానం కాదన్న ప్రధాని
పాట్నా: నలంద యూనివర్సిటీ దేశ సంస్కృతి, వారసత్వానికి చిహ్నమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీని పునరుజ్జీవనం దేశ విద్యారంగంలో మళ్లీ స్వర్ణయుగాన్ని తెస్తుందన్నారు. బిహార్‌లోని రాజ్‌గిర్‌లో బుధవారం నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్, గవర్నర్ రాజేంద్ర వి. అర్లేకర్, విదేశాంగ మంత్రి జైశంకర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘నలంద.. పేరు మాత్రమే కాదు.. ఒక గుర్తింపు. ఒక గౌరవం. ఒక విలువ. ఒక మంత్రం. ఒక గర్వం. ఒక గాథ” అని అన్నారు. పురాతన శిథిలాల నుంచి ఇది పునరుజ్జీవనం చెందిందన్నారు. అగ్ని కీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు.. కానీ జ్ఞానం కాదంటూ అఫ్గాన్లు ఈ విశ్వవిద్యాలయంపై జరిపిన దమనకాండను గుర్తుచేశారు. కాగా, నలంద కొత్త క్యాంపస్‌ను రూ.1,749 కోట్లతో నిర్మించారు. అంతకుముందు ప్రధాని మోదీ యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన పురాతన నలంద వర్సిటీని సందర్శించారు. ఏఎస్ఐ పాట్నా సర్కిల్లోని సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ గౌతమి భట్టాచార్య పురాతన శిథిలాల గురించి మోదీకి వివరించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇంక్ ఉందా? పోయిందా!
నలంద వర్సిటీ ఓపెనింగ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది. వేదికపైన మోదీ పక్కనే కూర్చున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ప్రధాని చూపుడు వేలిని పరిశీలించారు. ఆ వేలిపై ఓటు వేసినప్పుడు పెట్టిన సిరాచుక్క ఉందా? పోయిందా? అని చెక్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.