
- టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది: మోదీ
- ప్రపంచానికి కొత్త విశ్వాసాన్ని ఇచ్చింది
- అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తున్నా..
- మన్ కీ బాత్‌లో ప్రధాని వెల్లడి
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని.. మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఒక్కటైందని తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో త్రివిధ దళాలు ప్రదర్శించిన ధైర్యం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందన్నారు.
మన్‌కీ బాత్ 122వ ఎపిసోడ్లో మోదీ మాట్లాడారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ‘ఆపరేషన్ సిందూర్’ కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. దేశ ప్రజలను ఎంతో ప్రభావితం చేసింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీవోకేలోని టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశాం. 100 మందికిపైగా టెర్రరిస్టులు చనిపోయారు. ప్రతి భారతీయుడి సంకల్పం టెర్రరిజాన్ని అంతం చేయడమే. ఆపరేషన్ సింధూర్ విజయవంతమయ్యాక దేశంలోని చాలా ప్రాంతాల్లో జాతీయ జెండాలతో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తున్నాను’’ అని మోదీ అన్నారు. మన త్రివిధ దళాల దాడుల్లో ధ్వంసమైన కోట్లీలోని గుల్పూర్, అబ్బాస్, భీంబర్లోని బర్నాలా క్యాంపుల వీడియోలు, ఫొటోలను మన్ కీ బాత్‌లో ప్రదర్శించారు.
పహల్గాం నిందితులను కఠినంగా శిక్షిస్తాం
ఎన్నో కుటుంబాలు ‘ఆపరేషన్ సిందూర్’ను తమ జీవితాల్లో భాగం చేసుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్ తర్వాత బిహార్‌లోని కతిహార్, యూపీలోని కుషినగర్ తదితర ప్రాంతాల్లో జన్మించిన చిన్నారులకు ‘సిందూర్’ అనే పేరు పెట్టారు. పహల్గాంలో అమాయకులను చంపిన టెర్రరిస్టులను ఎట్టిపరిస్థితుల్లో వదలం. వాళ్లను కఠినంగా శిక్షిస్తాం.
టెర్రరిజంపై జరిగిన ఈ యుద్ధానికి దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు సంఘీభావం తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో మనం తయారు చేసిన ఆయుధాలతోనే శత్రువులకు బుద్ధి చెప్పాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ‘వోకల్ ఫర్ లోకల్’ క్యాంపెయిన్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది’’ అని మోదీ అన్నారు.
మావోయిజానికి వ్యతిరేకంగా పోరాడుతాం
మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని మోదీ అన్నారు. దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు. ‘‘మావోయిజానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతున్నది. మావోయిస్టుల నిర్మూలనలో గర్వించే విజయం సాధించాం.
మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలన్నీ మావోయిస్టుల ఆధీనంలో ఉండేవి. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. గడ్చిరోలి జిల్లాలోని కటేఝరి గ్రామానికి బస్సు సేవలు ప్రారంభించాం. దీంతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బస్సుకు ఘనంగా స్వాగతం పలికారు’’ అని మోదీ అన్నారు. బస్తర్, దంతెవాడ రీజియన్లలో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు.