జపాన్ మాజీ ప్రధానికి తుది వీడ్కోలు సభ

జపాన్ మాజీ ప్రధానికి తుది వీడ్కోలు సభ

మాజీ ప్రధాని షింజో అబెకు అధికారిక లాంఛనాలతో జపాన్ ప్రభుత్వం తుది వీడ్కోలు సభ నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న అబె జులై 8న హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొన్నిరోజులకు కుటుంబసభ్యులు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించారు. జపాన్ ప్రధానిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన షింజో అబె కోసం ప్రధాని ఫుమియో కిషిద తుది వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.

భారత్ కు మంచి మిత్రుడిగా మెలిగిన అబెకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రధాని మోడీ టోక్యోకు వెళ్లారు. షింజో అబెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో మైత్రి బలోపేతానికి కృషిచేశారన్నారు. ప్రస్తుత ప్రధాని కిషిద కూడా అదే తీరుని కొనసాగిస్తారనే నమ్మకం ఉందన్నారు. వీడ్కోలు సభలో పాల్గొనడానికి ముందే.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

టోక్యోలోని నిప్పాన్ బుడోకాన్ హాలులో షింజో అబేకు పుష్పాలతో ప్రధాని మోడీ నివాళి అర్పించారు. అక్కడే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వందకు పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. దీని కోసం18 వేల మంది సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నివాళులు అర్పించేందుకు ప్రజలను కూడా అనుమతించారు. ఇదిలా ఉండగా షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమానికి 94 కోట్ల 50 లక్షలు ఖర్చు పెట్టారు. ప్రజల పన్నులతో చేస్తున్న ఈ కార్యక్రమం రద్దు చేయాలని.. సుమారు 10 వేల మంది టోక్యో వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.