రామసేతు వద్ద ప్రధాని మోదీ పూజలు

రామసేతు వద్ద ప్రధాని మోదీ పూజలు
  • అరిచాల్ మునై బీచ్‌‌ ఫ్రంట్‌‌లో ప్రాణాయామం చేసిన మోదీ
  •     అరిచాల్ మునై బీచ్‌‌ ఫ్రంట్‌‌లో ప్రాణాయామం చేసిన మోదీ
  •     కోదండరామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

రామేశ్వరం/అహ్మదాబాద్:  అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దక్షిణాదిన తన స్పిరిచ్యువల్ జర్నీని ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి చేసుకున్నారు. కొన్ని రోజులుగా రామాయణంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్న ఆయన.. ఆదివారం తమిళనాడులోని రామనంతపురం జిల్లా కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ధనుష్కోటిలోని అరిచాల్ మునైలో ‘రామ సేతు’ మొదలైన ప్రాంతానికి చేరుకున్నారు. సీతమ్మను రావణుడు అపహరించడంతో.. లంకకు చేరుకునేందుకు వానర సేనతో కలిసి శ్రీరాముడు రామసేతును నిర్మించారని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా అరిచాల్ మునై బీచ్ ఫ్రంట్‌‌లో మోదీ పూజలు చేశారు. 

జాతీయ చిహ్నం ఉన్న స్థూపానికి పూలమాలలు వేశారు. సాగర తీరంలో ప్రాణాయామం చేశారు. సముద్రుడికి పూలు సమర్పించి, జలాలతో ప్రార్థించారు. శనివారం తమిళనాడు పర్యటనకు వచ్చిన మోదీ.. రాత్రి రామేశ్వరంలో బస చేశారు. ఆదివారం కోదండరామస్వామి ఆలయం, అరిచాల్ మునై సందర్శన తర్వాత మధురైకి, అటు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. 

డొమెస్టిక్ టూరిజాన్ని ప్రోత్సహించండి

‘వెడ్ ఇన్ ఇండియా’ను ప్రజలు ప్రోత్సహించాలని, తద్వారా దేశ సంపద దేశంలోనే ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్‌‌లోని అమ్రేలి సిటీలో జరిగిన ఖోదాల్‌‌ధామ్‌‌ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్‌‌గా ప్రధాని ప్రసంగించారు. డొమెస్టిక్ టూరిజాన్ని ప్రజలు ప్రమోట్ చేయాలని కోరారు. క్యాన్సర్ చికిత్స విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, వైద్యం అందించేందుకు 30 కొత్త ఆసుపత్రులను ఏర్పాటు చేశామని తెలిపారు.