ఇండియన్ యూనివర్సిటీలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

ఇండియన్ యూనివర్సిటీలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు
  • ఢిల్లీ వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ
  • దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ లు పెరిగినయ్
  • జ్ఞానం ఉన్నవారు సంతోషంగా, బలంగా ఉంటారని కామెంట్ 

న్యూఢిల్లీ: విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వ ఫ్యూచరిస్టిక్ పాలసీలు, నిర్ణయాలతో ఇండియన్ యూనివర్సిటీలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెక్నాలజీ ఫ్యాకల్టీ, కంప్యూటర్ సెంటర్, అకడమిక్ బ్లాక్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. 2014లో క్యూఎస్‌‌‌‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌‌‌‌లో 12 ఇండియన్ వర్సిటీలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 45కి పెరిగిందన్నారు. దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్‌‌‌‌ఐటీలు పెరిగాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవం, ప్రతిష్ట పెరిగిందని, మన యువకులపై ప్రపంచ విశ్వాసం పెరిగిందని అన్నారు. అమెరికాతో కుదిరిన ఒప్పందాలతో ఇండియాలోని యువకులకు స్పేస్, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. మన దేశంలో మైక్రాన్, గూగుల్ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయని వివరించారు. 

వర్సిటీ మాత్రమే కాదు.. ఓ ఉద్యమం

ఢిల్లీ యూనివర్సిటీ కేవలం ఒక వర్సిటీ మాత్రమే కాదని, ఓ ఉద్యమమని ప్రధాని అన్నారు. నలంద, తక్షశిల వంటి పురాతన భారతీయ విశ్వవిద్యాలయాలను ఆయన ప్రస్తావించారు. అవి ఉన్నప్పుడు మన దేశం సంతోషం, సౌభాగ్యంతో తులతూగిందన్నారు. శతాబ్దాలపాటు మన దేశం బానిసత్వంలో బతకడం వల్ల విద్యా కేంద్రాలన్నీ ధ్వంసమైపోయాయని, దేశాభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు. మళ్లీ ఇప్పుడు ప్రపంచంలోని ఐదు టాప్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచిందని చెప్పారు. జ్ఞానం ఉన్నవారు సంతోషంగా, బలంగా ఉంటారని మోదీ చెప్పారు.

మెట్రోలో మోదీ

డీయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి ఢిల్లీ మెట్రోలో ప్రధాని వెళ్లారు. లోక్ కల్యాణ్ మార్గ్ నుంచి వర్సిటీ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులతో కలుపుగోలుగా మాట్లాడారు. యువతీ, యువకులు, మహిళలతో ఆత్మీయంగా, నవ్వుతూ ముచ్చటించారు.  

ఉక్రెయిన్ సంక్షోభం, రష్యాలో తిరుగుబాటుపై  పుతిన్, మోదీ చర్చ

న్యూఢిల్లీ/మాస్కో: ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఫోన్ లో మాట్లాడుకున్నారు. ప్రస్తుతం రష్యాలో నెలకొన్న పరిస్థితులు, వాగ్నర్ గ్రూప్ ఇటీవలే లేవదీసిన పరిణామాలు, ఉక్రెయిన్ పై ఇరు దేశాల అధినేతలు చర్చించారు. వాగ్నర్  గ్రూప్  తిరుగుబాటును పుతిన్  సర్కారు అణచివేయడాన్ని మోదీ సమర్థించారు. రష్యా ప్రజల భద్రత కోసం, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పుతిన్  సర్కారు తీసుకున్న చర్యలను మోదీ అర్థం చేసుకున్నారని క్రెమ్లిన్  ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, పుతిన్  మాట్లాడుకున్నారని పీఎంఓ ఆఫీసు కూడా ఓ ప్రకటనలో తెలిపింది. 

రష్యాకు మోదీ గ్రేట్​ ఫ్రెండ్​.. 

ప్రధాని మోదీపై పుతిన్  ప్రశంసలు కురిపించారు. రష్యాకు మోదీ గొప్ప మిత్రుడని అభివర్ణించారు. మోదీ తెచ్చిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ఇండియా ఆర్థిక వ్యవస్థపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిందన్నారు. గురువారం మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మనది కాకపోయినా.. మంచిని అనుకరించడం వల్ల ఎలాంటి హాని జరగదు” అని పుతిన్ పేర్కొన్నారు.