
- వివిధ రంగాల్లో సహకారం అందిస్తాం
- భారత ప్రధానితో మాల్దీవుల నేతల వరుస భేటీలు
మాలె: మాల్దీవులకు వివిధ రంగాల్లో సహకారాన్ని కొనసాగించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పొరుగు దేశానికి ఇకపైనా ఇండియా సపోర్ట్ కొనసాగుతుందని, ఆ దేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. బ్రిటన్ పర్యటన తర్వాత శుక్రవారం మాల్దీవుల రాజధాని మాలెకు చేరుకున్న ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు, మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మయిజ్జు, మోదీ భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మాల్దీవులకు సుమారు రూ. 5 వేల కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ రుణాన్ని మోదీ ప్రకటించారు. శుక్రవారం రాత్రి మోదీకి మయిజ్జు ప్రత్యేకంగా విందు ఇచ్చారు.
శనివారం మాల్దీవుల వైస్ ప్రెసిడెంట్ ఉజ్ హుస్సేన్ మొహమ్మద్ లతీఫ్, మాజీ ప్రెసిడెంట్ మొహ్మద్ నషీద్, పార్లమెంట్ స్పీకర్ అబ్దుల్ రహీమ్ అబ్దుల్లా, వివిధ పార్టీల నేతలు మోదీని కలిశారు. మాల్దీవులకు భారత్ అందిస్తున్న సహకారానికి నేతలంతా కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవుల పార్లమెంట్లో ఇండియా– మాల్దీవ్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపు ఏర్పాటును మోదీ స్వాగతించారు. శనివారం మాల్దీవుల 60వ ఇండిపెండెన్స్ డే వేడుకలకు మోదీ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. మాల్దీవులతో భారత్‌కు 60 ఏండ్ల దౌత్య సంబంధాలు ఉన్నాయని గుర్తుచేస్తూ మోదీ ట్వీట్ చేశారు. మాల్దీవుల ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇండియాతో తమ దేశానికి శతాబ్దాల నుంచి చెక్కుచెదరని బంధం ఉందని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు అన్నారు.