
బెంగళూరులో మే6న జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన మెగా రోడ్ షోకు విశేష స్పందన లభించింది. ఏకంగా మూడు గంటలపాటు 26 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో సాగింది. కర్ణాటకలో మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా కర్ణాటకకు వచ్చి బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెగళూరు నగరంలో మెగా రోడ్ షో నిర్వహించారు.
బెంగళూరు సౌత్‌లోని సోమేశ్వర్ భవన్ ఆర్బీఐ గ్రౌండ్ నుంచి సాంకీ ట్యాంక్ వరకు 26 కిలోమీటర్లు మోడీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో పూర్తవడానికి మూడు గంటల సమయం పట్టింది. దక్షిణ, మధ్య బెంగళూరులోని దాదాపు 12 అసెంబ్లీ సెగ్మెంట్లను కలుపుతూ మోడీ రోడ్ షో నిర్వహించారు. ప్రధాని చేపట్టిన మెగా రోడ్‌షోకు ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ షోకు హాజరయ్యారు. మోడీ రోడ్ షోకు దాదాపు 10 లక్షల మంది హాజరై ఉంటారని బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు.
కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ని బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద సంఖ్యలో బజరంగ్ దళ్ కార్యకర్తలు మోడీ రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షోలో ప్రధాని వెంట బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ఉన్నారు. ఆదివారం ( మే 7) కూడా బెంగళూరు నగరంలో ప్రధాని మోడీ రోడ్ షో కొనసాగనుంది. తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు 10 కి.మీ. మేర మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు.