
వయనాడ్: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది సమాధి అయిన ఘటన సాధారణ విపత్తు కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారీ వర్షం కారణంగా జులై 30వ తేదీ తెల్లవారుజామున వయనాడ్ జిల్లాలో వరదలు పోటెత్తి, కొండచరియలు విరిగిపడి ఘోర విపత్తు బారిన పడిన ప్రాంతాలను ప్రధాని శనివారం పరిశీలించారు. బాధితులను పరామర్శించి ఓదార్చారు.
వారికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణానికి కేంద్రం తరఫున సాయం చేస్తామని ప్రకటించారు. శనివారం ఉదయం 11 గంటలకు కన్నూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ఐఏఎఫ్ హెలికాప్టర్ లో వయనాడ్ జిల్లాకు బయలుదేరారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపితో కలిసి ప్రధాని హెలికాప్టర్ ద్వారా పంచిరిమట్టమ్, ముండకై, చూరల్ మల ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది మామూలు విపత్తు కాదు. వేలాది కుటుంబాల కలలను చెదరగొట్టిన ఘోరమిది. విపత్తు నష్టాన్ని నేను కండ్లారా చూశాను. రిలీఫ్ క్యాంపుల్లో బాధితులను కలిసి మాట్లాడాను. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించాను” అని తెలిపారు.
బాధితులకు పరామర్శ
చూరల్ మల ప్రాంతం వద్ద కాలినడకన తిరుగుతూ అక్కడి పరిస్థితిని ప్రధాని ప్రత్యక్షంగా చూశారు. కొండచరియలు విరిగిపడి మట్టిలో కలిసిపోయిన వెల్లార్ మల హైస్కూల్ ప్రాంతానికీ వెళ్లారు. చూరల్ మలలో సహాయక చర్యల కోసం ఆర్మీ నిర్మించిన 190 పీట్ల బెయిలీ బ్రిడ్జిపై నడుస్తూ ప్రస్తుత పరిస్థితి గురించి ఆర్మీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెప్పాడిలోని ఓ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపును కూడా ప్రధాని సందర్శించారు.
అరగంట సేపు అక్కడ ఉండి బాధితులతో మాట్లాడారు. కుటుంబసభ్యులను అందరినీ కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలను ఓదార్చారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును ప్రధానికి చెప్పుకోగా, అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు. మెప్పాడిలోని ప్రైవేట్ హాస్పిటల్ ను కూడా సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని పరామర్శించారు.
ఈ విపత్తులో చాలా మంది పిల్లలు తమ ఆప్తులను కోల్పోవడం, కొందరు పూర్తి అనాథలుగా మారిపోవడంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. వెల్లర్ మల స్కూల్ లో 582 మంది స్టూడెంట్లు ఉన్నారని, విపత్తు తర్వాత నుంచి 27 మంది ఆచూకీ తెలియడంలేదని అధికారులు తెలిపారు. స్కూల్ బిల్డింగ్ పునర్నిర్మాణానికి సంబంధించి వారికి ప్రధాని సూచనలు చేశారు.
వయనాడ్ లో పర్యటనను ముగించుకున్న తర్వాత ప్రధాని సాయంత్రం తిరిగి కన్నూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కాగా, జులై 30వ తేదీ తెల్లవారుజామున భారీ వర్షం కారణంగా వరుసగా మూడుచోట్ల కొండచరియలు
విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 416 మంది సమాధి అయిపోగా, వందలాది మంది గాయపడ్డారు. మరో 150 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు.
థ్యాంక్యూ మోదీజీ: రాహుల్ గాంధీ
ఘోరమైన విపత్తు బారిన పడిన వయనాడ్ ప్రాంతాన్ని సందర్శించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘వయనాడ్‌ను సందర్శించి, అక్కడి విపత్తు నష్టాన్ని స్వయంగా పరిశీలించినందుకు థ్యాంక్యూ మోదీజీ. ఇది మంచి విషయం. వయనాడ్ లో జరిగిన పెను విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత అయినా దీనిని జాతీయ విపత్తుగా ప్రధాని ప్రకటిస్తారని ఆశిస్తున్నా” అని ఆయన శనివారం ట్వీట్ చేశారు.
మోదీ వయనాడ్ పర్యటన మంచి పరిణామమని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ కూడా పేర్కొన్నారు. అలాగే పదిహేను నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను కూడా సందర్శించేందు కు కూడా ప్రధానికి టైం దొరకాలని ఆశిస్తున్నామని ట్వీట్ చేశారు.
ఇది మామూలు విపత్తు కాదు. వేలాది కుటుంబాల కలలను చెదరగొట్టిన ఘోరమిది. విపత్తు నష్టాన్ని నేను కండ్లారా చూశాను. రిలీఫ్ క్యాంపుల్లో బాధితులను కలిసి మాట్లాడాను. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించాను.
- ప్రధాని నరేంద్ర మోదీ