ఆఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను త్వరగా తీసుకురండి

ఆఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను త్వరగా తీసుకురండి

ఆఫ్గనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను త్వరగా స్వదేశానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు ప్రధాని మోడీ. నిన్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు ప్రధాని. ఆఫ్గన్ పరిణామాలపై చర్చించారు. తాలిబాన్ల ఆక్రమణ నేపథ్యంలో.. ఈ అంశంపై భారత్ ఎలా స్పందించాలి..? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేదానిపై చర్చించారు. అలాగే.. అఫ్గనిస్తాన్ లో ఉన్న భారతీయులను స్వదేశానికి ఎలా తీసుకురావాలనేదానిపైనా డిస్కస్ చేసినట్టు సమాచారం. ఈ మీటింగ్ కు హోం, రక్షణశాఖ, డిఫెన్స్, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. 

ఆఫ్గన్ లో చిక్కుకున్న భారతీయులందర్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని విదేశాంగశాఖ ప్రకటించింది. కాబూల్ ఎయిర్ పోర్టులో రాకపోకలు మొదలవ్వగానే... అందర్ని దేశానికి తీసుకొస్తామని చెప్పింది. భారత్ రావాలనుకున్న అఫ్గాన్ పౌరులకు వీసాలిచ్చేందుకు ఎమర్జెన్సీ వీసా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపింది. కాబూల్ లోని ఎంబసీలో ఉన్న భారత అధికారులు, సిబ్బంది నిన్ననే స్వదేశానికి తిరిగి వచ్చారు. సోమవారం ఓ విమానంలో కొంతమంది సిబ్బంది భారత్ వచ్చారు. నిన్న ఎయిర్ ఫోర్స్ కు చెందిన C-17 విమానంలో 120 మంది అధికారులు, సిబ్బంది కాబూల్ నుంచి గుజరాత్ లోని జామ్ నగర్ చేరుకున్నారు. అయితే కాబూల్ ఎంబసీలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు భారత రాయబారి రుద్రేంద్ర టాండన్. ఎంబసీలో పనిచేసే అఫ్గనిస్తాన్ దేశీయులు సేవలు కొనసాగిస్తున్నారని తెలిపారు. అఫ్గాన్ లో చిక్కుకున్న ఇండియన్స్ కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.