వ్యాక్సిన్ కోసం మొత్తం ప్రపంచం భారత్ వైపే చూస్తోంది

వ్యాక్సిన్ కోసం మొత్తం ప్రపంచం భారత్ వైపే చూస్తోంది

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సిన్ అభివృద్ధిపై చర్చించడానికి లోక్ సభ, రాజ్య సభకు చెందిన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోడీ మీటింగ్ నిర్వహించారు. తక్కువ ధరకు లభించే సురక్షితమైన వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని మోడీ అన్నారు. అందుకే మొత్తం ప్రపంచం భారత్ వైపు ఆశగా చూస్తోందన్నారు. అతి త్వరలో భారత్‌‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టీమ్స్ వ్యాక్సిన్ పంపిణీని ఎలా చేపట్టాలనే దానిపై కలసి పని చేస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ, పంపిణీ విషయంలో మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్ మెరుగైన స్థాయిలో ఉంది. వ్యాక్సినేషన్ చేయడానికి అనుభవజ్ఞులతో కూడిన అతి పెద్ద నెట్‌‌వర్క్ మనకు అందుబాటులో ఉంది. కరో్నా వ్యాక్సిన్ ధరకు సంబంధించి ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ, దాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటాం. దేశంలో సుమారుగా 8 వ్యాక్సిన్‌‌లు పలు దశల ట్రయల్స్‌‌లో ఉన్నాయి. వ్యాక్సిన్ రావడానికి మరెంతో సమయం పట్టదని నిపుణులు చెబుతున్నారు. విజయవంతమైన కరోనా వ్యాక్సిన్‌‌ను తయారు చేయడంలో మన శాస్త్రవేత్తలు తప్పక విజయం సాధిస్తారు. సైంటిస్టులు ఓకే చెప్పిన వెంటనే భారత్‌‌లో వ్యాక్సిన్ పంపిణీని షురూ చేస్తాం. తొలి దశలో హెల్త్‌‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌‌లైన్ వర్కర్స్, వృద్ధులతోపాటు విషమంగా ఉన్న వారికి వ్యాక్సినేషన్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కోల్డ్ చైన్ స్టోరేజీలు, లాజిస్టికల్ సపోర్ట్‌‌ను తీసుకుంటాం. వ్యాక్సిన్ స్టాక్‌‌‌‌తోపాటు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్‌‌ కోసం ప్రత్యేక సాఫ్ట్‌‌వేర్‌‌ను రూపొందిచాం’ అని మోడీ పేర్కొన్నారు.