నాకు నష్టం జరిగినా సరే..రాజీపడేది లేదు.. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం

నాకు నష్టం జరిగినా సరే..రాజీపడేది లేదు.. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం
  • నాకు నష్టం జరిగినా సరే..  రాజీపడేది లేదు
  • రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: మోదీ
  • ఎంతటి మూల్యం చెల్లించేందుకైనా నేను, దేశం సిద్ధం 
  • అమెరికా టారిఫ్​లపై ప్రధాని కామెంట్స్​
  • స్వామినాథన్ శత జయంతి వేడుకలో ప్రసంగం

న్యూఢిల్లీ: భారత్‌‌పై భారీగా టారిఫ్‌‌లు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌‌కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. అందుకు ఎంతటి భారీ మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌‌లో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ టారిఫ్‌‌లపై పరోక్షంగా స్పందించారు. దేశ రైతుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ‘‘రైతులు, పాడి రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదు. ఇందుకు వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాకు తెలుసు. అందుకు నేను సిద్ధం.. భారత్ కూడా సిద్ధం” అని చెప్పారు. కాగా, తమ దేశ డెయిరీ, అగ్రికల్చర్ ఉత్పత్తులను మరింతగా భారత్‌‌లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తున్నది. అయితే దీనివల్ల దేశ రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందుకు ఒప్పుకోబోమని కేంద్రం తేల్చి చెప్పింది.  రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని  చేస్తున్న బెదిరింపులకూ తలొగ్గలేదు. ఈ నేపథ్యంలోనే మన దేశంపై యూఎస్ భారీగా టారిఫ్‌‌లు విధించింది. 

పోషకాహార భద్రతపై ఫోకస్ పెట్టాలి.. 

దేశంలో ఆహార భద్రత కోసం కృషి చేసిన ఎంఎస్‌‌ స్వామినాథన్‌‌ను ఆదర్శంగా తీసుకుని పోషకాహార భద్రత కోసం సైంటిస్టులు కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పంటల మార్పిడిపై మరింత రీసెర్చ్ చేయాలన్నారు. ‘‘వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట రకాలను అభివృద్ధి చేయాలి. కరువు, వేడి, వరదలను తట్టుకుని నిలబడే పంట రకాలను డెవలప్ చేయాలి. వ్యవసాయంలో ఏఐ ఆధారిత టెక్నాలజీ వినియోగం పెంచాలి. భూసార పరీక్షలను ఈజీగా, తక్కువ ఖర్చుతో చేసేందుకు టూల్స్‌‌ను రూపొందించాలి. డ్రిప్ ఇరిగేషన్‌‌, సోలార్‌‌‌‌ పంపులను ప్రోత్సహించాలి” అని సూచించారు. ఎంఎస్ స్వామినాథన్ గొప్ప దార్శనికుడు అని, ఆయన ఎంతో ముందుచూపుతో వ్యవసాయంలో అద్భుత పరిశోధనలు చేశారని కొనియాడారు. పురుగు మందులను ఎక్కువగా వాడొద్దని ఆనాడే హెచ్చరించారని గుర్తు చేశారు. అటు వాతావరణం, ఇటు భూసారంపై ఎంతో దృష్టి పెట్టారని పేర్కొన్నారు. కాగా, స్వామినాథన్‌‌పై స్టాంప్, నాణేలను మోదీ విడుదల చేశారు. 

దేశాభివృద్ధికి రైతులే పునాది.. 

రైతులు దేశానికి వెన్నెముక అని ప్రధాని మోదీ అన్నారు. రైతుల అభివృద్ధే దేశాభివృద్ధికి పునాది అని చెప్పారు. ‘‘రైతుల సంక్షేమం కోసం ఎన్నో స్కీమ్స్‌‌ అమలు చేస్తున్నాం. పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీయా యోజన, పీఎం కృషి సించాయ్ యోజన, పీఎం కిసాన్ సంపద యోజన, పీఎం ధన్‌‌ధన్య యోజన తదితర పథకాలు అమలు చేస్తున్నాం. రైతులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు వాళ్లలో నమ్మకాన్ని పెంపొందించే విధంగా పథకాలు రూపొందించాం. పంట పెట్టుబడిని తగ్గించి, రైతుల ఆదాయం పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులకు కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తున్నాం” అని తెలిపారు. ఈనామ్ ప్లాట్‌‌ఫామ్ ద్వారా రైతులు తమ పంటలను ఈజీగా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.