టీకా వేస్కోండి..వందేళ్లున్న మా అమ్మ కూడా వేసుకుంది

టీకా వేస్కోండి..వందేళ్లున్న మా అమ్మ కూడా వేసుకుంది

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ విషయంలో సందేహం వదిలిపెట్టాలని, పుకార్లను నమ్మవద్దని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశంలో ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కోరారు. తన తల్లికి 100 ఏళ్లు ఉన్నాయని, ఆమె రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారని చెప్పారు. ‘‘సైన్స్​ను, మన సైంటిస్టులను నమ్మండి. ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్లు వేయించుకున్నారు. నేను కూడా రెండు డోసులు తీసుకున్నా” అని వివరించారు. 78వ మన్ కీ బాత్ సందర్భంగా ఆదివారం రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. వ్యాక్సిన్ వేసుకుంటేనే.. కరోనా నుంచి తమను తాము కాపాడుకోగలరని అన్నారు. ‘‘పుకార్లను స్ప్రెడ్ చేసే వాళ్లను చేయనివ్వండి. మనం మన పని చేసుకుందాం. అందరూ వ్యాక్సిన్ వేసుకునేలా చేద్దాం. కరోనా ముప్పు ఇంకా పోలేదు. కరోనా రూల్స్, వ్యాక్సినేషన్​పై మనం ఫోకస్ పెడుదాం” అని చెప్పారు. మధ్యప్రదేశ్​లోని బెతులు జిల్లాలో దులారియా గ్రామానికి చెందిన వారితో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్‌‌‌‌పై రూమర్లు ఎక్కువయ్యాయని, టీకా వేసుకోవాలంటే భయమవుతోందని వారు ప్రధానితో చెప్పారు. దీంతో ఆయన తన తల్లి ప్రస్తావన తెచ్చారు. ప్రధాని ఇచ్చిన కౌన్సెలింగ్‌‌‌‌తో గ్రామంలో చాలామంది టీకాలు వేయించుకున్నారు. ‘‘మా నాన్న కిశోరీలాల్ ధుర్వేతో ప్రధాని మాట్లాడారు. తర్వాత టీకా వేయించుకున్నారు. ఇప్పుడు ఆయన చాలామందికి చెబుతున్నారు’’ అని రవీంద్ర ధుర్వే చెప్పారు.

రెండే దారులు..

‘‘కరోనా పోయిందని ఎవరైనా చెబితే.. అస్సలు నమ్మొద్దు. ఆ వైరస్.. వేషం మార్చుకోవడంలో మాస్టర్. అనేక కొత్త రూపాల్లోకి (మ్యుటేషన్లను ఉద్దేశిస్తూ) మారిపోగలదు. మనకు రెండు దారులు ఉన్నాయి. మొదటిది.. మాస్కు పెట్టుకోవడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కొనసాగించాలి. రెండోది.. వ్యాక్సిన్ వేసుకోవడం” అని చెప్పారు. ఇప్పటిదాకా 31 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ కార్యదర్శి గురు ప్రసాద్ మహాపాత్రకు, స్ప్రింట్ లెజెండ్ మిల్కా సింగ్​కు నివాళులర్పించారు.

అథ్లెట్లపై ఒత్తిడి పెట్టొద్దు

ఒలింపిక్స్‌‌‌‌కు వెళ్తున్న ఇండియన్ అథ్లెట్ల పోరాటాలు, విజయాలను మోడీ పంచుకున్నారు. ప్రజలు ఈ క్రీడాకారులపై ఎలాంటి ఒత్తిడి పెట్టొద్దని ప్రధాని పిలుపునిచ్చారు. ‘‘టోక్యోకు వెళేతున్న ప్రతి ఒక్క అథ్లెట్ ఎంతో కష్టపడ్డారు. వారు హృదయాలను గెలవడానికి అక్కడకు వెళ్తున్నారు. మన జట్టుకు మద్దతు ఇవ్వాలి.  వారిపై ఒత్తిడి తీసుకురావద్దు’’ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.