
నూతన జాతీయ విద్యావిధానంపై మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కొత్త విద్యావిధానంతో విస్తృత ప్రయోజనాలున్నాయని ఆయన అన్నారు. విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చామని ఆయన తెలిపారు.
‘కొత్త విద్యావిధానం గురించి అపోహలు, అనుమానాలు వద్దు. ఈ విద్యావిధానంపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. దేశవ్యాప్తంగా మేధావులందరూ దీనిపై చర్చించాలి. ఒకే దేశం.. ఒకే విద్య అమలు చేయాలన్నదే మా లక్ష్యం. దేశ భవిష్యత్ కోసమే ఈ నూతన విద్యావిధానం. 21వ శతాబ్ధంలో అవసరమైన విద్యను ముందుకు తీసుకొచ్చాం. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించొచ్చు. విద్యార్థుల కోసం ఆలోచనాత్మక, సమస్యాత్మక విద్యను అమలుచేయబోతున్నాం. విద్యార్థులు తమకు నచ్చిన చదువులు చదువుకోవచ్చు. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులు ఎంచుకోవచ్చు. మూడు, నాలుగు సంవత్సరాలు చర్చించిన తర్వాత ఈ విధానాన్ని ఆమోదించాం. దీనికోసం లక్షలమంది సలహాలు స్వీకరించాం. మాతృభాషలో పిల్లలకు చదువు ఎంతో ముఖ్యం. పిల్లలను గ్లోబల్ సిటిజన్ మార్చడమే మా ఉద్దేశం. కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలి. కొత్త విద్యావిధానంతో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుంది. పిల్లల్లో నేర్చుకోవాలన్న కోరిక పెరుగుతుంది. వారి ఇష్టానుసారంగానే డిగ్రీలు చదువుకోవచ్చు. టాలెంట్, టెక్నాలజీలో మనల్ని మించినవారు లేరు. దేశంలో ప్రతి ఒక్కరికి విద్య అందేలా చూస్తున్నాం. ఎడ్యుకేషన్, రిసెర్చ్ గ్యాప్ తగ్గిస్తున్నాం. ఉన్నత విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నాం’ అని ఆయన అన్నారు.