అన్ని రాష్ట్రాలకూ ప్రయారిటీ

అన్ని రాష్ట్రాలకూ ప్రయారిటీ
  • ఏ ఒక్క ప్రాంతం వెనకబడినా దేశం డెవలప్ కాదు 
  • ‘ఏఎన్ఐ’ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ    
  • ఐదు రాష్ట్రాల్లో మేమే గెలుస్తం 
  • వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి ముప్పు
  • రాహుల్ సభలో ఉండడు.. చెప్పింది వినడని కామెంట్స్​ 


దేశంలోని అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలకూ అభివృద్ధి ఫలాలు అందాలి. ఏదైనా ఒక ప్రాంతం వెనకబడినా దేశం వెనకబడినట్లే అవుతుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే దేశ డెవలప్ మెంట్ సాధ్యం. వెనుకబడిన ప్రాంతాల్లో యువ ఐఏఎస్ లను ఆయా రాష్ట్రాలు నియమించాలి. అధికారులను తరచూ మార్చకూడదు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే మా కోరిక.
‑ ప్రధాని మోడీ

న్యూఢిల్లీ:   దేశంలో ప్రతి రాష్ట్రానికీ తగిన ప్రాధాన్యం ఇవ్వాలనేదే తన ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల అవసరాలు, ఆకాంక్షలు తనకు బాగా తెలుసని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ఆకాంక్షలను నెరవేర్చేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. యూపీలో ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందుగా బుధవారం ‘ఏఎన్ఐ’ ఎడిటర్ స్మితా ప్రకాశ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ అనేక అంశాలపై మాట్లాడారు. ‘‘దేశంలోని అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలకూ అభివృద్ధి ఫలాలు అందాలి. ఏదైనా ఒక ప్రాంతం వెనకబడినా దేశం వెనకబడినట్లే అవుతుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం” అని మోడీ చెప్పారు. పలు రాష్ట్రాల సహకారం లేక దేశంలో 115 జిల్లాలు వెనకబడ్డాయని ఆయన వెల్లడించారు. అక్కడ ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు కావట్లేదన్నారు. పాలనలో వెనకబాటుపై ఒక రాష్ట్రం అభ్యంతరం తెలిపిందని, ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ‘‘వెనుకబడిన ప్రాంతాల్లో యువ ఐఏఎస్ లను ఆయా రాష్ట్రాలు నియమించాలి. అధికారులను తరచూ మార్చకూడదు” అని ప్రధాని వివరించారు. దేశంలోని డైవర్సిటీని ప్రపంచస్థాయికి తీసుకెళ్తున్నామని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతోనే విదేశీ నేతలు రాష్ట్రాలను సందర్శిస్తున్నారని, గతంలో విదేశీ నేతల్ని ఢిల్లీకి పరిమితం చేసే పరిస్థితి ఉండేదని అన్నారు. 
ఐదు రాష్ట్రాల్లో మేమే గెలుస్తం 
ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఫుల్ మెజారిటీతో గెలుస్తుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, ప్రజలు మళ్లీ తమకే పట్టం కడతారని అన్నారు. ‘‘ఎన్నికలు ఉన్నా, లేకున్నా.. సొంతంగా అధికారంలో ఉన్నా, కూటమిలోఉన్నా.. బీజేపీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న విజన్​తో ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.    
వారసత్వ రాజకీయాలతోనే ముప్పు  
వారసత్వ రాజకీయాలతోనే ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని ప్రధాని మోడీ అన్నారు. కుటుంబ ఆధిపత్యం ఉండే పార్టీల్లో ట్యాలెంట్ ఉన్న కొత్త నాయకులకు అవకాశాలు దొరకవన్నారు. సమాజ్ వాదీ వంటి పార్టీలు కుటుంబవాదం గురించి మాత్రమే ఆలోచిస్తాయన్నారు. ఆ పార్టీలో ఒకే కుటుంబం నుంచి 25 ఏండ్లలో 45 మంది కీలక పదవులు పొందినట్లుగా తెలిసిందన్నారు. ‘‘రామ్ మనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెజ్, నితీశ్ కుమార్ వంటి వాళ్లు నిజమైన సోషలిస్ట్ నేతలు. వీళ్లలో ఎవరైనా తమ కుటుంబాల్లోని వ్యక్తులను పార్టీల్లోకి తీసుకురావడం మీరు చూశారా? కానీ కుటుంబవాద విధానంతో ఉండేవాళ్లంతా ఫేక్ సోషలిస్టులు” అని మోడీ విమర్శించారు. ‘‘కుటుంబంలోని ఒకరిద్దరు ఎన్నికల్లో గెలిచి పదవులు పొందడం వేరు. కుటుంబంలోని వ్యక్తులంతా పార్టీలోని ముఖ్యమైన అన్ని పదవుల్లో తిష్ట వేయడం వేరు. జమ్మూకాశ్మీర్, హర్యానా, యూపీ, జార్ఖండ్, తమిళనాడులో ఇలాంటి రాజకీయాలు ఉన్నాయి. ఇలాంటి పార్టీలు తమను నడిపే ఆ ఒక్క ఫ్యామిలీ కోసమే పని చేస్తాయి” అని చెప్పారు.   యూపీలోని లఖీంపూర్ ఖేరి ఘటనపై దర్యాప్తులో యూపీ ప్రభుత్వం పూర్తి ట్రాన్స్ పరెంట్ గా వ్యవహరిస్తోందని మోడీ చెప్పారు. రైతుల లాభం కోసమే వ్యవసాయ చట్టాలను తెచ్చామని, ఇప్పుడు దేశ ప్రజల ప్రయోజనాల కోసం వాటిని వెనక్కి తీసుకున్నామని మోడీఅన్నారు.   పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ హైవేపై భద్రతా లోపం అంశంపై తాను స్పందించనన్నారు. తన మాటలు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ పై ప్రభావం చూపొచ్చన్నారు.  ఈ విషయంలో నిజం ఏమిటన్నది సుప్రీంకోర్టే తేలుస్తుందన్నారు. 

రాహుల్ చెప్పింది వినడు  
‘‘పార్లమెంటులో చర్చలకు మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో చర్చలు జరిగేటప్పుడు సభలో ఉండడు. చెప్పింది కూడా వినడు. అలాంటి వ్యక్తికి నేను ఏమని సమాధానం చెప్పగలను?” అని మోడీ ఫైర్ అయ్యారు. చైనాతో బార్డర్ వివాదం, నిరుద్యోగం వంటి అంశాలపై సంబంధిత మంత్రులు సభలో వివరణ ఇచ్చారని, రాహుల్ కూడా కొన్ని అంశాలపై మాట్లాడారని గుర్తు చేశారు. అయితే, రాహుల్ సభలో కూర్చోడని, చెప్పింది వినడన్నారు. తాను ఎప్పుడూ ఒకరిపై మాటలతో దాడి చేసేలా భాషను ఉపయోగించబోనని, కానీ కొన్ని మీడియా సంస్థలు కాంట్రవర్సీలను క్రియేట్ చేసేందుకు కావాలనే తన మాటలకు వక్ర భాష్యం చెప్తుంటాయన్నారు.