గాంధీనగర్‌‌‌‌లో భారీ రోడ్‌‌ షో

 గాంధీనగర్‌‌‌‌లో భారీ రోడ్‌‌ షో

అహ్మదాబాద్:  ప్రజలు అభివృద్ధికే ఓట్లు వేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘ఏ పార్టీకీ వరుసగా రెండో సారి అధికారం దక్కని రాష్ట్రాల్లో.. మేం మళ్లీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజాస్వామ్య శక్తి ఇది. ప్రజలు అభివృద్ధికి ఓటు వేయడం వల్లే ఇది సాధ్యమైంది’’ అని తెలిపారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా శుక్రవారం గాంధీనగర్‌‌‌‌కు ప్రధాని వచ్చారు. పంచాయతీ సంస్థలకు ఎన్నికైన లక్ష మంది ప్రతినిధులతో నిర్వహించిన సభలో మాట్లాడారు. పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించేందుకు ప్రైమరీ స్కూళ్ల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని గ్రామ ప్రతినిధులను కోరారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా గ్రామ  ప్రతినిధులు ప్రతి ఊరిలోనూ 75 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 

‘సర్పంచ్ పతి’ వ్యవస్థ మనకెందుకు? 
మహిళలు సర్పంచ్‌‌గా ఎన్నికైతే వారి తరఫున భర్తలు సర్పంచ్‌‌గిరీ చేస్తారని, మనకు ఎస్పీ (సర్పంచ్ పతి) వ్యవస్థ అవసరం లేదని ప్రధాని అన్నారు. గుజరాత్‌‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారని మోడీ అన్నారు. గ్రామాలు బలంగా, స్వయం సమృద్ధిగా ఉండాలన్నారు. ‘‘ఇది గాంధీ, సర్దార్ పటేల్ పుట్టిన భూమి. బాపూ ఎల్లప్పుడూ గ్రామీణ అభివృద్ధి, బలమైన గ్రామాల గురించే చెప్పేవారు. ఇప్పుడు మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. ఆయన కలలను మనం నిజం చేయాలి” అని పిలుపునిచ్చారు.  

భారీ రోడ్‌‌ షో.. జనం బారులు
గుజరాత్‌‌లోని గాంధీనగర్‌‌‌‌లో ఎయిర్‌‌‌‌పోర్టు నుంచి బీజేపీ స్టేట్ ఆఫీసు దాకా 10 కిలోమీటర్ల మేరకు ప్రధాని రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్ కారులో నిలబడి ఆయన.. రోడ్డుకు రెండు వైపులా నిలిచిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోడీతోపాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర చీఫ్ సీఆర్ పాటిల్ తదితరులు ఉన్నారు.