దేశాన్ని ప్రక్షాళన చేయాల్సిన టైమొచ్చింది

దేశాన్ని ప్రక్షాళన చేయాల్సిన టైమొచ్చింది
  • స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ
  • చెదపురుగులా అవినీతి.. దేశాన్ని తినేస్తున్నది
  • ఇండియా ప్రతిభను, సామర్థ్యాలను బంధుప్రీతి 
  • దెబ్బతీస్తున్నదిచెడుపై పోరాటం నా బాధ్యత.. 
  • ప్రజలు సపోర్ట్ చేయాలివరుసగా తొమ్మిదోసారి 
  • ఎర్రకోట నుంచి జెండా ఎగురవేసిన ప్రధాని

న్యూఢిల్లీ: అవినీతి, కుటుంబ పాలన, బంధుప్రీతి అతిపెద్ద సవాళ్లని, వీటిని దేశం నుంచి తరిమేయాల్సిన సమయం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవి కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కావని, అన్ని రంగాల్లోనూ ఉన్నాయని చెప్పారు. 25 ఏండ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే పంచ ప్రాణాల (ఐదు సంకల్పాలు) లక్ష్యమని, దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలను కోరారు. దేశం ఇప్పుడు పెద్ద లక్ష్యాలను మాత్రమే నిర్దేశించుకోవాలని.. ఆ పెద్ద లక్ష్యాలు ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ కోసం తప్ప ఇంకో దాని కోసం కాకూడదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఎర్రకోటపై వరుసగా తొమ్మిదో సారి జాతీయ జెండాను ప్రధాని మోడీ ఎగురవేశారు. దాదాపు 82 నిమిషాలపాటు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 75 ఏండ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో కొత్త సంకల్పంతో కొత్త మార్గంలో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కుటుంబ పాలన దేశానికి తీవ్ర అన్యాయం చేసింది. కుటుంబ రాజకీయాలు సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తాయి.దేశ సంక్షేమంపై వాటికి ఎలాంటి ఆసక్తి ఉండదు. భారతదేశ రాజకీయాలను, సంస్థలను ప్రక్షాళన చేయడంలో ప్రజలు నాతో కలిసి రావాలి.

పంచ ప్రాణాలు

2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏండ్లు అవుతుందని, స్వాతంత్ర్య సమరయోధుల కలల్ని అప్పటిలోగా నెరవేర్చేందుకు పెద్ద సంకల్పాలను తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘‘అభివృద్ధి చెందిన భారతదేశం.. వలసవాద మనస్తత్వ జాడను తొలగించడం.. మన వారసత్వం గురించి గర్వపడటం.. మన ఐక్యతా బలం.. పౌరులు తమ బాధ్యతలను నిజాయితీతో నెరవేర్చడం.. అనే పంచ ప్రాణాల(ఐదు సంకల్పాలు)పై దృష్టి సారించాలి” అని కోరారు. ప్రధాని, సీఎంలు కూడా ఇందులో భాగం కావాలన్నారు. ఈ అమృత ఘడియల్లో కొత్త ఇండియా వేగవంతమైన పురోగతిని చూడాలని ప్రతి పౌరుడు ఉత్సాహంతో ఆకాంక్షిస్తున్నాడని మోడీ చెప్పారు. ఇండియా.. మదర్ ఆఫ్ డెమోక్రసీ అని అన్నారు.

అవినీతిపై పోరాడాలి

‘‘దేశంలో చాలా మందికి నివసించడానికి తగినంత చోటు లేదు. కానీ ఇదే సమయంలో కొంతమందికి తమ అక్రమ డబ్బును దాచుకోవడానికి తగినంత స్థలం లేదు” అని ఇటీవలి రెయిడ్స్ సందర్భంగా భారీగా డబ్బు బయటపడటాన్ని మోడీ ప్రస్తావించారు. అవినీతిని నిర్మూలిస్తేనే ప్రజల జీవితం మెరుగవుతుందని అన్నారు. ‘‘చెదపురుగుల మాదిరి.. దేశాన్ని అవినీతి తినేస్తున్నది. దీనిపై మనం పూర్తి సామర్థ్యంతో పోరాడాలి. దేశాన్ని లూటీ చేసిన వాళ్ల నుంచి తిరిగి రాబట్టేందుకు మనం కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు. అవినీతిపరులను కొన్ని పార్టీలు వెనకేసుకురావడంపైనా మండిపడ్డారు. వారసత్వం, బంధుప్రీతిని రాజకీయాల్లోనే కాదు.. దేశంలోని అన్ని ఇతర సంస్థల్లోనూ పెంచి పోషించారని, దీనికి ముగింపు పలకాలని అన్నారు. ఇండియా ప్రతిభను, సామర్థ్యాలను బంధుప్రీతి దెబ్బతీస్తుందని.. అవినీతికి ఇది కూడా ఒక కారణమని చెప్పారు. ఇలాంటి చెడు అంశాలపై పోరాడటం తన రాజ్యాంగ, ప్రజాస్వామిక బాధ్యత అని, ప్రజలు సపోర్ట్ చేయాలని కోరారు. 

నాశనమైతమన్నరు..

బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోతే ఇండియా నాశనమై.. చీకటి యుగంలోకి వెళ్లిపోతుందని చాలా మంది అన్నారని, కానీ దేశం మనుగడ సాగించిందని, అభివృద్ధి చెందుతూనే ఉన్నదని మోడీ అన్నారు. 75 ఏండ్ల స్వంతంత్ర భారతంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయని, కానీ ప్రజలెన్నడూ వెనకడుగు వేయలేదన్నారు. వందల ఏండ్ల బానిసత్వం లోతైన గాయాలు చేసినా.. అన్ని అసమానతలను తట్టుకునే సామర్థ్యం భారతదేశానికి ఉందని ప్రజలు నిరూపించారన్నారు. ఐక్య భారతదేశానికి లింగ సమానత్వమే కీలకమని, ‘నారీ శక్తి’కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వడమనేది.. దేశ ఎదుగుదలకు ముఖ్యమైన పిల్లర్ అని చెప్పారు. మన మాటల్లో, ప్రవర్తనలో మహిళల గౌరవాన్ని తగ్గించే పనేదీ చేయకూడదని కోరారు. మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, వారి సహకారంతో అంతే ఎక్కువగా ప్రయోజనాలను పొందవచ్చని చెప్పారు.

యోగా, ఆయుర్వేదం వైపు ప్రపంచం చూపు

‘‘ఇయ్యాల ప్రపంచం పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇదే సమయంలో మన దగ్గర గ్లోబల్ వార్మింగ్‌‌కు పరిష్కారం ఉంది. మన పూర్వీకులు అందించిన వారసత్వం మనకు ఉంది. నేడు ప్రపంచం సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ గురించి మాట్లాడుతున్నది.. యోగా, ఆయుర్వేదం వైపు చూస్తున్నది. ఇదే మనం ప్రపంచానికి అందిస్తున్న వారసత్వం’’ అని మోడీ వివరించారు. ఇంధనం విషయంలో గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతున్నామని, దీంతో పెట్రోల్‌‌లో 10 శాతం ఇథనాలు కలపాలని ప్లాన్ చేసినట్లు మోడీ వివరించారు. ‘‘ఇది సాధించడం చాలా కష్టమైన పనిగా కనిపించింది. అయితే..మనం వేగంగానే పెట్రోల్‌‌తో ఇథనాల్‌‌ను కలపడం సాధించాం” అని అన్నారు. 10 శాతం మిక్సింగ్ లక్ష్యాన్ని 2022 నవంబర్‌‌‌‌ నాటికి చేరుకోవాల్సి ఉండగా.. జూన్‌‌కే సాధించామని తెలిపారు.

ఇది టెకేడ్ సమయం

ఇది ఇండియా ‘టెకేడ్’ సమయమని, డిజిటల్ టెక్నాలజీ ప్రతి విషయంలో సంస్కరణలను తీసుకురానుందని మోడీ చెప్పారు. 5జీ, సెమీ కండక్టర్ల తయారీ, గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా క్షేత్రస్థాయి నుంచి రివల్యూషన్ తీసుకువస్తున్నామని అన్నారు. ఆవిష్కరణలకు ‘జై అనుసంధాన్’ అవసరం ఉందని ప్రధాని అన్నారు. ‘జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. జై అనుసందధాన్’ అని నినదించారు. ‘‘మన ఆవిష్కరణ శక్తిని చూడండి.. ప్రపంచంలో 40% ఫైనాన్షియల్ డిజిటల్ లావాదేవీలు ఇండియాలోనే జరుగుతున్నాయి. మన దేశం త్వరలో 5జీ యుగంలోకి అడుగుపెడుతున్నది. ఆప్టిక్ ఫైబర్‌‌ను ఏర్పాటు చేయడంలో వేగంగా అడుగులు వేసింది’’ అని చెప్పారు. దేశంలో  200 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను వేశామని, ఇంకే దేశానికీ ఇది సాధ్యం కాలేదన్నారు. 

స్వాతంత్య్ర వేడుకల్లో దేశీ గన్‌‌

పంద్రాగస్టు వేడుకల్లో 21 తుపాకుల గౌరవ వందనం కోసం మొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హోవిట్జర్ గన్‌‌ను ఉపయోగించడాన్ని మోడీ ప్రస్తావించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌‌‌‌డీవో) ద్వారా అడ్వాన్స్‌‌డ్‌‌ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ (ఏటీఏజీఎస్‌‌)ను అభివృద్ధి చేశామన్నారు. డిఫెన్స్ ప్రొడక్టుల విషయంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని, దాదాపు 300 వస్తువులను దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించామన్నారు. 

మన కలలు వేరు కాదు

రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తున్నదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మోడీ పరోక్షంగా స్పందించారు. ‘‘కోఆపరేటివ్ ఫెడరలిజం, ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తిపై నాకు విశ్వాసం ఉంది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అదే టైమ్‌లో వేరే పార్టీ (కాంగ్రెస్) కేంద్రంలో ఉన్నప్పుడు నేను ఆచరించి నది ఇదే” అని చెప్పారు. ‘‘మనకు వేర్వేరు కార్యక్రమాలు ఉండొచ్చు.. పని తీరు వేరుగా ఉండొచ్చు.. కానీ దేశం కోసం మనం కనే కలలు వేరు కాదు” అని అన్నారు.

మువ్వన్నెల తలపాగాతో...

సంప్రదాయ కుర్తా, బ్లూ జాకెట్‌‌తో పంద్రాగస్టు వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. 3 రంగుల గీతలు ఉన్న తలపాగా ధరించారు. 21 గన్ సెల్యూట్ మధ్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమర యోధులు, దేశం కోసం పాటుపడిన నేతలకు నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సావర్కర్, రామ్‌మనోహర్ లోహియా, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, మంగల్ పాండే, భగత్ సింగ్ తదితరులను స్మరించుకున్నారు.