
చిక్కబళ్లాపుర/బెంగళూరు (కర్నాటక): ఇండియాలో మాట్లాడే భాషల విషయంలో కొన్ని పార్టీలు ఆటలాడుతున్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రాంతీయ గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఫైర్ అయ్యారు. చిక్కబళ్లాపుర జిల్లా ముద్దెనహళ్లి మండలం సత్యసాయి గ్రామంలో నిర్మించిన శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(ఎస్ఎంఎస్ఐఎంఎస్ఆర్) మెడికల్ కాలేజీతో పాటు శ్రీ సత్యసాయి రాజేశ్వరీ మెమోరియల్ బ్లాక్‌ను మోడీ శనివారం ప్రారంభించి మాట్లాడారు. దేశంలో భాషాభివృద్ధి కోసం పార్టీలు పాటుపడటంలేదని విమర్శించారు. ‘‘గ్రామాల్లో ఉంటున్న వెనుకబడిన వర్గాల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదగడం ప్రతిపక్ష పార్టీలకు ఇష్టం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ భాషల్లో మెడిసిన్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. కన్నడ లాంగ్వేజ్‌లో చదువుకుని ఎంతోమంది నిరుపేద పిల్లలు డాక్టర్లుగా ఎదిగారు. అందుకే ప్రతిపక్షాలు భాషాపరంగా చిచ్చు పెడుతున్నాయి”అని మోడీ అన్నారు.
కన్నడ సుసంపన్నమైన భాష
కన్నడ సుసంపన్నమైన భాష అని, దేశ గౌరవాన్ని పెంచుతుందని మోడీ అన్నారు. మెడిసిన్, ఇంజినీరింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను కన్నడలో బోధించే ఆలోచన గతంలో ఏ సర్కార్‌కు రాలేదని మండిపడ్డారు. గ్రామీణ, నిరుపేద పిల్లల గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. తమ ప్రభుత్వమే వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నదని వివరించారు. పేదలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూస్తు వచ్చాయన్నారు. జన్ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు మందులు అందజేస్తున్నామని తెలిపారు. ఎస్ఎంఎస్ఐఎంఎస్ఆర్ లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. 2014లో 380 కంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉండేవని, ఇప్పుడు 650కి పెరిగాయన్నారు.
క్యూలో నిలబడి.. టికెట్ కొని మెట్రోలో మోడీ ప్రయాణం
బెంగళూరులో రూ.4,249 కోట్లు ఖర్చుపెట్టి 12 స్టేషన్లతో కూడిన 13.71 కిలో మీటర్ల వైట్ ఫీల్డ్.. (కడుగోడి) నుంచి క్రిష్ణరాజపురం మెట్రో లైన్‌ను మోడీ ప్రారంభించారు. వైట్‌ఫీల్డ్ స్టేషన్ క్యూలో నిలబడి కామన్ ప్యాసింజర్ మాదిరి టికెట్ కొని మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలో రైలు సిబ్బంది, నిర్మాణ కార్మికులు, స్టూడెంట్స్‌తో పాటు వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడారు. మోడీ వెంట కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం బస్వరాజ్ బొమ్మై, హెల్త్ మినిస్టర్ సుధాకర్ తదితరులు ఉన్నారు.