జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల సర్దార్ అని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. భారత భూ భాగంలోకి చైనా ప్రవేశించినప్పుడు ఆయన ఓపియం డ్రగ్ తీసుకుని నిద్రపోయారని ఆరోపించారు. గురువారం రాజస్థాన్ చిత్తోర్ గఢ్ ఎలక్షన్ ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. ‘‘తనకు 56 అంగుళాల ఛాతీ ఉందని, ఎవరికీ భయపడనని మోదీజీ చెబుతుంటారు. మీకు భయం లేకపోతే భారత భూభాగాన్ని చైనాకు ఎందుకు వదిలారు.
వారు ఇండియాలోకి వస్తున్నప్పుడు నిద్రపోతున్నారా..? రాజస్థాన్ పొలాల నుంచి ఓపియంను తీసుకొని చైనీస్ మీకు తినిపించారా?" అని ప్రశ్నించారు. ప్రధానికి దేశం గురించి పట్టింపు లేదన్నారు. ఆయన గాంధీ కుటుంబాన్ని దూషించడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ‘‘మోదీ ఎప్పుడు అబద్ధాలు చెబుతూనే ఉంటారు. ఆయన 'అబద్ధాల సర్దార్'. గాంధీ కుటుంబంలో 1989 నుంచి ఎవరూ ప్రధాని, మంత్రి పదవి చేపట్టలేదు. గాంధీ కుటుంబ సభ్యులు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. అయినప్పటికీ, మోదీ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు”అని ఖర్గే పేర్కొన్నారు.