
- దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరం
- బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై భారతీయుల్లో ఆందోళన
- అక్కడ త్వరలో సాధారణ పరిస్థితి
- ప్రపంచానికే అన్నంపెట్టే స్థాయికి భారత్ ఎదగాలి
- వరల్డ్ స్కిల్ క్యాపిటల్‌గా భారత్
- త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం
- 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం
- 5 ఏండ్లలో 75 వేల మెడికల్ సీట్లు
- ఘనంగా 78వ ఇండిపెండెన్స్ డే.. ఎర్రకోటపై 11వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన మోదీ
న్యూఢిల్లీ : మహిళలపై నేరాలకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళలపై నేరాల ఘటనలను వీలైనంత త్వరగా విచారించాలని, అఘాయిత్యాలకు పాల్పడిన వారిని వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని సూచించారు. స్వాంత్రత్య సమరయోధులకు, దేశం కోసం ధైర్యంగా, కష్టపడి పనిచేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న సైనికులు, రైతులు, యువత అందరికీ సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోటపై గురువారం మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ప్రధాని హోదాలో ఆయన వరుసగా 11వసారి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ప్రధాని 98 నిమిషాలపాటు రికార్డు స్థాయిలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై లైంగికదాడిపైనా ఆయన స్పందించారు. ‘‘ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీ, స్పేస్ ఇలా అనేక రంగాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. కానీ కొన్ని ఆందోళనకర అంశాలు కూడా ఉన్నాయి. ఈ ఎర్రకోట సాక్షిగా నేడు నా బాధను వ్యక్తంచేస్తున్నా. మన తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న పైశాచిక దాడులపై జనం ఆగ్రహంతో ఉన్నారు. వారి బాధను నేను అర్థం చేసుకున్నా. దేశం, సమాజం, మన రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై నేరాలను సీరియస్‌గా తీసుకోవాలి” అని పేర్కొన్నారు. నేరం చేయాలంటేనే భయపడేలా శిక్షలపై విస్తృత ప్రచారం జరగాలని మోదీ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో త్వరలోనే సాధారణ పరిస్థితి
బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువుల భద్రతపై భారత్‌లోని 140 కోట్ల మంది ఆందోళన చెందుతున్నారని మోదీ పేర్కొన్నారు. అక్కడి హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నారని తెలిపారు.త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా, 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది 140 కోట్లమంది కల అని చెప్పారు. అందరూ కలిసికట్టుగా కృషిచేస్తే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు.
త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ..
త్వరలోనే భారత్మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకోసం డెవలప్మెంట్ను బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. తాము ఏది చేసినా రాజకీయ ప్రయోజనాల కోసం చేయడంలేదని, నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. గత పదేండ్లలో బ్యాంకింగ్ సెక్టార్‌ను బలోపేతం చేశామని చెప్పారు.
రాబోయే 5 ఏండ్లలో 75 వేల కొత్త మెడికల్ సీట్లు
దేశ యువత ఇక్కడే చదువుకునేలా విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉన్నదని ప్రధాని తెలిపారు. విదేశీయులే ఇక్కడికి వచ్చి చదువుకునేలా ఉండాలని అన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ప్రపంచ ప్రసిద్ధ నలంద వర్సిటీని పునరుద్ధరించినట్టు చెప్పారు. రాబోయే ఐదేండ్లలో దేశంలో 75వేల కొత్త మెడికల్ సీట్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గత పదేండ్లలో తమ సర్కారు మెడికల్ సీట్ల సంఖ్యను లక్షకు పెంచిందని వెల్లడించారు.
ప్రధాని రికార్డు ప్రసంగం.. 98 నిమిషాలు
ఎర్రకోట వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ దాదాపు 98 నిమిషాలు మాట్లాడారు. 2016లో ఆయన మాట్లాడిన 96 నిమిషాలే ఇప్పటివరకు సుదీర్ఘ స్పీచ్‌గా ఉండేది. ఇప్పుడు దాన్ని అధిగమించారు.
పంద్రాగస్టు వేడుకలకు 6 వేల మంది గెస్టులు
ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 6 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత బృందం, అటల్ ఇన్నోవేషన్ మిషన్ లబ్ధిదార్లు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కార్మికులు, సర్పంచులు, లఖ్ పత్ దీదీలు, డ్రోన్ దీదీలు, తదితరులు పాల్గొన్నారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్, పీఎమ్ శ్రీ పథకం లబ్ధిదారులైన విద్యార్థులు, 500 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. గిరిజన కళాకారులు, వన్ ధన్ వికాస్ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు పొందిన గిరిజన పారిశ్రామిక వేత్తలు, పీఎం కిసాన్, ఫసల్ బీమా యోజన లబ్ధిదారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు హాజరయ్యారు.
దేశానికి సెక్యులర్సివిల్ కోడ్ అవసరం
దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్ మతపరమైనదని, అది వివక్షాపూరితంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్‌పై చర్చించి ఆదేశాలు జారీ చేసిందని, దీనిపై విస్తృతంగా చర్చించాలన్నారు. దేశంలో సమతౌల్యం దెబ్బ తీసేందుకు కొందరు యత్నిస్తున్నారని అన్నారు. వారసత్వ, కులతత్వ పాలిటిక్స్ వదిలించుకోవాలని దేశ ప్రజలకు సూచించారు.