ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది: ప్రధాని మోదీ

ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది: ప్రధాని మోదీ

దేశంలో గిరిజన, ఆదివాసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ విస్మరించిందని..,  మధ్యప్రదేశ్ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారు.. అధికారంలో లేనప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మరో మాటలో చెప్పాలంటే.. దోపిడీ, అశాంతి కాంగ్రెస్‌కు ఆక్సిజన్ వంటివని ప్రధాని ఫైర్ అయ్యారు.

చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెబుతూ.. ప్రజలు అధికారం నుండి దించేశారన్నారు. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం ప్రజలను కులం, భాష, ప్రాంతాల వారీగా విభజించాలని చూస్తున్నారని... కాంగ్రెస్ చర్యలను దేశప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం మధ్యప్రదేశ్ లో పర్యటించిన మోదీ.. రూ.7,550 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఝబువా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడికి రాలేదని.. ప్రజా సేవకుడిగా మాత్రమే వచ్చానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలబడి.. ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

మధ్యప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌.. డబుల్ స్పీడ్‌తో పనిచేస్తోందన్నారు మోదీ. కాంగ్రెస్ పార్టీ గిరిజనులను ఎప్పుడూ పట్టించుకోలేదని.. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని విమర్శించారాయన. ఆ పార్టీకి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గ్రామాలు, రైతులు, పేదలు గుర్తుకొస్తారంటూ మండిపడ్డారు.  రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి నిరాశే మిగులుతుందన్నారు. 2024 ఎన్నికల్లో NDA కూటమి 4వందలకు పైగా సీట్లు సాధిస్తుందన్నారు.మూడోసారి మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.