ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయండి

 ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయండి

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్గా జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2 నుంచి  15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోందని చెప్పారు. దేశంలో ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా ఈ ఉద్యమాన్ని  ముందుకు తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు.  ఆగస్టు 2న పింగళి వెంకయ్య జయంతి సందర్బంగా ఆ రోజు నుంచి ఆగస్టు 15 వరకు జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలని ‘మన్ కీ బాత్’  ప్రసంగంలో దేశ ప్రజలను మోడీ కోరారు.   

91వ ఎడిషన్ ‘మన్ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం ఒక అద్భుతమైన, చారిత్రక ఘట్టానికి సాక్ష్యమిస్తోందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని సూచించారు. 

దేశం కోసం ప్రాణాలు అర్పించిన షహీద్ ఉద్ధమ్‌ సింగ్‌ జీకి ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.  హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న మిజార్‌ మేళాను వీలైతే సందర్శించాలని ప్రజలను కోరారు. మరోవైపు.. పీవీ సింధూ, నీరజ్‌ చోప్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలని మోడీ ఆకాక్షించారు.