కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్లాన్ పక్కాగా ఉండాలి

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్లాన్ పక్కాగా ఉండాలి

న్యూఢిల్లీ: ‘‘దేశవ్యాప్తంగా ఎన్నికలను, డిజాస్టర్ మేనేజ్​మెంట్ ప్రోగ్రామ్స్​ను విజయవంతంగా చేశాం. వీటి నుంచి నేర్చుకున్న పాఠాలతో వ్యాక్సిన్ పంపిణీకి ప్లాన్ రూపొందించాలి” అని అధికారులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థను ఒకసారి పరిశీలించి.. అదే విధంగా వ్యాక్సిన్ పంపిణీ, అందుకు తగిన ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచించారు. పంపిణీ ప్రక్రియలో రాష్ట్రాలు, యూటీలు, జిల్లా స్థాయి అధికారులు, సివిల్ సొసైటీ సంస్థలు, వాలంటీర్లు, ఎక్స్​పర్టులను భాగస్వాములను చేయాలన్నారు. కరోనా పరిస్థితిపై, వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఎలా పంపిణీ చేయాలనే అంశంపై ప్రధాని శనివారం రివ్యూ చేశారు. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లపై చర్చించారు. దేశంలోని ప్రజలందరికీ వేగంగా వ్యాక్సిన్ అందజేయాలని సూచించారు. పంపిణీకి ప్లాన్ చేసే సమయంలో  భౌగోళిక పరిధిని, డైవర్సిటీని పరిగణలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ పంపిణీపై 48 గంటల్లోనే ప్రధాని రెండుసార్లు మీటింగ్ నిర్వహించారు. గురువారం జరిగిన మీటింగ్​లో కూడా దీనిపైనే చర్చించారు.

నిర్లక్ష్యం వద్దు

ఫిజికల్​ డిస్టెన్స్ ను అన్నివేళలా పాటించాలని ప్రధాని మోడీ మరోసారి కోరారు. రాబోయే పండుగ సీజన్​లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం వహించొద్దని, మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ ప్రయత్నాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో ప్రతి స్టెప్.. పూర్తిగా, కేర్​ఫుల్​గా టెస్ట్ చేసిన తర్వాతే జరగాలని ప్రధాని చెప్పారు. వ్యాక్సిన్ డోసేజ్​ల కోల్డ్ స్టోరేజ్.. వాక్సినేషన్ క్లినిక్స్ ను మానిటర్ చేసేందుకు మెకానిజం.. సిరింజిలు, ఇతర పరికరాల ప్రిపరేషన్, నిల్వ వంటి వాటిపైనా తగిన ప్లానింగ్ ఉండాలని ఆదేశించారు” అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘కరోనా వ్యాక్సిన్ స్టోరేజీ, పంపిణీ, అడ్మినిస్ట్రేషన్​కు సంబంధించి పూర్తి వివరాలతో బ్లూ ప్రింట్ తయారు చేసేందుకు రాష్ర్టాలు, యూటీలు, ఇతర స్టేక్​హోల్డర్లతో నేషనల్ ఎక్స్​పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్ 19(ఎన్ఈజీవీఏసీ) సంప్రదింపులు జరుపుతోంది” అని చెప్పింది.

దేశంలో అభివృద్ధి దశలో 3 వ్యాక్సిన్లు

దేశంలో మూడు వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. రెండు టీకాలు ఫేజ్ 2 ట్రయల్స్ లో ఉండగా, మూడోది ‘కొవిషీల్డ్’ మాత్రం మూడో దశలో ఉంది. కొవిషీల్డ్ ను యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్​ఫర్డ్, అస్త్రజెనెకా కలిసి డెవలప్ చేస్తున్నాయి. కొవిషీల్డ్ పై గత నెలలో ముంబై, పుణెలోని ఆస్పత్రులు అడ్వాన్స్​డ్ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించాయి. ఇవి విజయవంతమైతే సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఆ వ్యాక్సిన్​ను తయారు చేస్తుంది