
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1, 3వ తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్న ప్రధాని..ఆ తర్వాత 3వ తేదీన నిజామాబాద్‌లో పర్యటించనున్నారు.
ముందుగా పాలమూరుకు..
ప్రధాని మోదీ అక్టోబర్ 1వ తేదీన శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయానికి ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్టోబర్ 1 మధ్యాహ్నం 1:30 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 2:05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుని 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సభ ముగించుకుని హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తారు. సాయంత్రం 4.45 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనం అవుతారు.
తర్వాత ఇందూరుకు..
అక్టోబర్ 3వ తేదీన ప్రధాని మోదీ కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2:55కి నిజామాబాద్‌కు చేరుకుంటారు. 3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేస్తారు. ఆ తర్వాత 3:45 నుంచి 4:45 వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని మోదీ బహిరంగ సభను ముగించుకుని సాయంత్రం 5 గంటలకు నిజామబాద్ నుంచి హెలికాప్టర్‌లో బీదర్ బయలుదేరి వెళ్తారు.
మోదీ చేయనున్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..
- నాగ్‌పూర్ -విజయవాడ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించి రూ. 6400 కోట్ల రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన
- హైదరాబాద్ వైజాగ్ కారిడార్‌కు సంబంధించిన NH- 365BB రహదారి ప్రాజెక్ట్‌లో 59 కి.మీ పొడవు గల సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు నాలుగు లేనింగ్‌లకు రూ. 2460 కోట్ల భారతమాల పరియోజన కింద అభివృద్ధి చేయబడిన రహదారి ప్రారంభం
- రూ. 500కోట్లతో ‘37 కిలో మీటర్ల జక్లెయిర్ – కృష్ణా కొత్త రైల్వే లైన్ కు శంకుస్థాపన
- కర్ణాటకలోని హాసన్ నుండి చెర్లపల్లి వరకు ఆయిల్ అండ్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు రూ. 2710 కోట్లతో శంకుస్థాపన
- కృష్ణపట్నం నుండి హైదరాబాద్ (మల్కాపూర్) వరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క రూ. 1940 కోట్ల మల్టీ-ప్రొడక్ట్ పెట్రోలియం పైప్‌లైన్ కు శంకుస్థాపన
- హైదరాబాద్ యూనివర్సిటీలో ఐదు కొత్త భవనాలను ప్రారంభం..