- పోలెండ్‌లో రెండురోజుల పర్యటన పూర్తి.. ఆ దేశ ప్రధాని టస్క్‌తో చర్చలు
వార్సా: ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఇండియా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధానికి వెళ్లకుండా.. చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. రాజకీయ స్థిరత్వంతోనే శాంతి నెలకొంటుందని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన పోలెండ్ ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ టస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. తర్వాత సంయుక్తంగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇండియా, పోలెండ్ మధ్య బంధం బలోపేతానికి మరింత కృషి చేస్తామని మోదీ అన్నారు. ‘‘ఉక్రెయిన్, వెస్ట్రన్ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతున్నది. చర్చలతో ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోవచ్చని ఇండియా నమ్ముతది. ప్రతీ సమస్యకు యుద్ధం అనేది పరిష్కారం కాదు.
ఈ హింసా కాండలో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది మానవాళి ఉనికికే ప్రమాదం. చర్చలు, దౌత్యమార్గంలో స్థిరత్వం, శాంతి స్థాపనకు ఇండియా మద్దతు ఇస్తుంది’’అని ప్రధాని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య 70 ఏండ్లుగా స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతున్నదని, అన్ని రంగాల్లో సాయం చేస్తామని తెలిపారు.
10 గంటలు రైలులో ప్రయాణం
ఉక్రెయిన్ పర్యటన కోసం మోదీ ‘ట్రైన్‌ఫోర్స్ వన్’ అనే విలాసవంతమైన రైలులో గురువారం సాయంత్రం బయలుదేరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో విమానాశ్రయాలకు భద్రత కరువైంది. రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన రైల్లో పది గంటలు ప్రయాణించి కీవ్ కు చేరుకోనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన ఈ ట్రైన్లో అన్ని రకాల సౌలత్లు ఉంటాయి.