
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు ఆయన వెళ్లనున్నారు. దాదాపు రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
తొలుత మేఘాలయలో పర్యటించనున్న ప్రధాని ఆ రాష్ట్రంలో రూ. 2,450 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. టెలికం సేవలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 4జీ నెట్‌వర్క్ మొబైల్ టవర్లను జాతికి అంకితం ఇవ్వనున్నారు. షిల్లాంగ్‌లోని ఉమ్‌సాలిలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐఐఎం)ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
మేఘాలయ నుంచి త్రిపుర వెళ్లనున్న మోడీ.. అక్కడ రూ. 4,350 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పీఎం ఆవాస్ యోజన కింద రూ.3,400 కోట్ల వ్యయంతో నిర్మించిన గృహాలను ఆయన లబ్దిదారలకు అందజేయనున్నారు. అనంతరం గ్రామ్‌సడక్ యోజన కింద 230 కిలోమీటర్ల పొడవైన 32 రహదారులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఆనంద్‌నగర్‌లోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, అగర్తల లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీని కూడా మోడీ ప్రారంభించనున్నారు.