
హైదరాబాద్: ముచ్చింతల్లో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాలల్లో హోమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఐదు వేల మంది రుత్వికులు పాల్గొంటున్నారు. రెండో రోజు వేడుకలకు జీయర్ స్వాములు, రుత్వికులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు ఫిబ్రవరి 14 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోడీ ముచ్చింతల్ రానున్నారు. ఆ రోజున ప్రధాని 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 6న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేడుకల్లో పాల్గొననున్నారు. 7న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఫిబ్రవరి 9న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహస్రాబ్ది కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుని వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో సైతం ముచ్చింతల్ కు రానున్నారు. అయితే ఆయన ఏ రోజున వస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. వీరితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో పాటు పలువురు విదేశీ ప్రముఖులు సైతం సహస్రాబ్ది వేడుకల్లో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. ముచ్చింతల్ లో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా 7వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.