ఇయ్యాల మేఘాలయ, త్రిపురకు మోడీ

ఇయ్యాల మేఘాలయ, త్రిపురకు మోడీ
  • ఇయ్యాల మేఘాలయ, త్రిపురకు మోడీ
  • రూ.6,800 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 

షిల్లాంగ్/అగర్తల: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఆదివారం మేఘాలయ, త్రిపురలో పర్యటిస్తారు. రూ.6,800 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రెండు రాష్ట్రాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు పబ్లిక్ ర్యాలీల్లో పాల్గొంటారు. మొదట మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కు వెళ్లనున్న ప్రధాని.. అక్కడి నుంచి మధ్యాహ్నం త్రిపుర రాజధాని అగర్తలకు వెళ్తారు. ప్రధాని టూర్ కోసం రెండు రాష్ట్రాల్లో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రధాని వెళ్లనున్న ప్రాంతాలను కేంద్ర బలగాలు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి. కాగా, ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ టూర్ షెడ్యూల్..

మోడీ ఆదివారం ఉదయం 9:30 గంటలకు షిల్లాంగ్ చేరుకుంటారు. అక్కడ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం) క్యాంపస్ సహా ఇతర ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్(ఎన్ఈసీ) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఎన్ఈసీ మీటింగ్ కు హాజరవుతారు. ఆపై బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:25 గంటలకు అగర్తల చేరుకుంటారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద త్రిపురలో నిర్మించిన 2 లక్షలకు పైగా ఇండ్లను ప్రారంభిస్తారు. వివేకానంద గ్రౌండ్ లో లబ్ధిదారులతో నిర్వహించే సభలో మాట్లాడతారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నిర్మించనున్న 32 రోడ్లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గెస్ట్ హౌస్ కు చేరుకొని బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమవుతారు.