కేసీఆర్​, జగన్ చెరో దిక్కు

కేసీఆర్​, జగన్ చెరో దిక్కు
  • ఇప్పుడు ఉత్తర, దక్షిణాలుగా ఇద్దరి రాజకీయాలు
  • ఏపీలో ప్రధానిని ఘనంగా స్వాగతించిన జగన్
  • మోడీ టూర్​కు నాలుగోసారి దూరంగా కేసీఆర్​
  • రాష్ట్రపతి ఎన్నికలోనూ వేర్వేరు దారులు

హైదరాబాద్​ :  రాజకీయంగా తెలుగు రాష్ట్రాల సీఎంల తీరు​ ఉత్తర దక్షిణాలుగా సాగుతున్నది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ వ్యవహారాల్లోనూ వీరిద్దరి మధ్య పొంతనే లేకుండా పోయింది. అక్కడ జగన్​.. ఇక్కడ కేసీఆర్​ అనుసరిస్తున్న వేర్వేరు పంథా ఆసక్తి రేపుతున్నది. అటు కేంద్ర ప్రభుత్వంతో అనుసరిస్తున్న వైఖరి.. ఇటు జాతీయ రాజకీయాల్లో చెరో దిక్కుగా అడుగులేస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సోమవారం ఆంధ్రప్రదేశ్​కు  వెళ్లిన ప్రధాని మోడీకి అక్కడి సీఎం జగన్​ ఘన స్వాగతం పలికారు. ప్రధానితో కలిసి వివిధ కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, వివిధ అభివృద్ధి పనులను కేంద్రం నుంచి రాబట్టుకునేందుకు ప్రధానికి తన వంతు విజ్ఞప్తులు అందించారు. ప్రధాని ఉన్నంత సేపు జగన్​ ఆయన వెంటే ఉన్నారు. కానీ, రెండు రోజుల ముందు ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే.. అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. ప్రధానిని మర్యాద పూర్వకంగా ఆహ్వానించే ఆనవాయితీని సీఎం కేసీఆర్ మరోసారి ఉల్లంఘించారు. వరుసగా నాలుగోసారి ప్రధాని టూర్​కు ఆయన దూరంగా ఉన్నారు. దీంతో తెలంగాణ ప్రయోజనాలు, కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రధానికి, కేంద్ర మంత్రులకు చెప్పుకునే అరుదైన అవకాశం చేజారినట్లయింది. ఏపీలో జగన్​ అధికారంలోకి వచ్చిన కొత్తలో.. సీఎం కేసీఆర్ ఆయనను వేలు పట్టి నడిపించినంత దగ్గరగా ఉన్నారు. జగన్​ ప్రమాణ స్వీకారానికి హాజరైన కేసీఆర్​ రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి సాధిస్తే.. దేశమంతా మనవైపే చూస్తుందని సందేశమిచ్చారు. వరుసగా పలుమార్లు జగన్​తో భేటీ కావటంతోపాటు ప్రగతిభవన్​కు ఆహ్వానించి చర్చలు జరిపారు. అప్పుడు రాజకీయంగానూ తాము ఒక్కటేనని దోస్తీ చాటిన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. రాజకీయంగా ఉత్తర దక్షిణ ధ్రువాలుగా మారిపోయారు.  రాష్ట్రపతి ఎన్నిక విషయంలో చెరో అభ్యర్థికి మద్దతు పలకటంతో ఇద్దరి మధ్య పెరిగిన పొలిటికల్​ గ్యాప్​ను  స్పష్టం చేసింది.  

కొత్త పార్టీపై మాట ముచ్చటకూ దూరమే
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పార్టీ పెట్టేందుకు కేసీఆర్​ కొంతకాలంగా మంతనాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి సీఎంలు, కొన్ని చోట్ల ప్రతిపక్ష నేతలతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్​, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్​ వెళ్లి వచ్చారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సంప్రదింపుల్లో ఉన్న కేసీఆర్​ ఏపీ సీఎం జగన్​ను సంప్రదించిన దాఖలాలు లేవు. మోడీకి సపోర్టుగా ఉంటున్నారనే కారణంతో జగన్​ను కేసీఆర్​ దూరం పెట్టారా..? కేసీఆర్​ చేస్తున్న హంగామా నచ్చకనే జగన్​ దూరమయ్యారా..? అనే సందేహాలు అన్ని పార్టీల లీడర్లలో వ్యక్తమవుతున్నాయి. 

చాన్స్​ మిస్సయిందా?
రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేసీఆర్​తో పాటు రాష్ట్ర మంత్రులు గడిచిన ఆరు నెలల్లో వివిధ సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లి వచ్చారు. తీరా.. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు మొత్తం హైదరాబాద్​లో రెండు రోజులుంటే.. కేసీఆర్ తో పాటు కేబినెట్​ మంత్రులు పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రచార పటాటోపం చూపించేందుకు టీఆర్​ఎస్​ చేసిన హంగామాతో ఒరిగేందేమీ లేదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి వెళ్లి విజ్ఞప్తులు ఇచ్చుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. 

అప్పుడు అట్ల.. ఇప్పుడు ఇట్ల..
పెద్ద నోట్ల రద్దు మొదలు కరోనా టైమ్​ వరకు కేసీఆర్​ కేంద్రంలోని బీజేపీకి సపోర్టు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టాలన్నింటికీ టీఆర్​ఎస్​ మద్దతుగా నిలబడింది. ఇప్పుడు అదే కేసీఆర్​ పొలిటికల్​ స్టాండ్ మార్చుకున్నారు. ప్రధాని మోడీని దేశం నుంచి తరిమి కొట్టాలంటూ ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ముందు నుంచీ బీజేపీతో ఉన్న ఏపీ సీఎం జగన్​.. ఇప్పుడు అదే స్టాండ్ అనుసరిస్తున్నారు. ప్రధానికి సపోర్టుగా ట్వీట్లు చేస్తున్నారు. కేంద్రంతో కలిసి మెదులుతున్నారు. తొలిసారిగా ఆదివాసీ మహిళను ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. ఆదివాసీ మహిళకు వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్​ సిన్హాను గెలిపిస్తామని కేసీఆర్​ సవాల్​ చేశారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే జగన్​ మద్దతు ప్రకటించారు. అభ్యర్థిని ఖరారు చేయకముందే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకు​ తమ మద్దతు ఉంటుందని జగన్​ బహిరంగంగా చెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల సీఎంల పొలిటికల్​ రూట్​ సపరేట్​ అయిందనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది.