పీవీకి భారతరత్న ప్రదానంపై ప్రధాని మోదీ ట్వీట్

 పీవీకి  భారతరత్న ప్రదానంపై ప్రధాని మోదీ ట్వీట్
  •     ఢిల్లీలోని రాష్ట్ర పతిభవన్​లో పురస్కార ప్రదానోత్సవం
  •     హాజరైన ప్రధాని, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు
  •     పీవీ సేవలు చిరస్మరణీయమన్న ప్రధాని మోదీ

 

న్యూఢిల్లీ, వెలుగు: దేశ మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావుకు కేంద్రం ప్రకటించిన అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఆయన కుటుంబ సభ్యులు అందుకున్నారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ లో ‘భారతరత్న’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్​, కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పీవీ తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించారు. పలు రంగాల్లో దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఐదుగురికి ‘భారత రత్న’ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు దఫాలుగా కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో తెలుగు తేజం, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కు పురస్కారం దక్కింది. అలాగే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, బీజేపీ అగ్రనేత ఎల్​కే అద్వానీ, వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్​ను ఈ పురస్కారాలతో గౌరవించింది. ఇందులో ఎల్ కే అద్వానీ మినహా  మిగిలిన నలుగురికి మరణాంతరం ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 

అవార్డు స్వీకరించిన పీవీ తనయుడు 

పీవీ నర్సింహారావు కు ప్రకటించిన ‘భారతరత్న’పురస్కారాన్ని పీవీ తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు అందుకున్నారు. అనంతరం ఆయన  ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చౌదరీ చరణ్ సింగ్ తరపున ఆయన మనమడు జయంత్ సింగ్, కర్పూరీ ఠాకూర్ తరఫున ఆయన కుమారుడు రామ్ నాథ్, స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు పురస్కారాలను స్వీకరించారు. కాగా, ఎల్ కే అద్వానీకి రాష్ట్రపతి ముర్ము ఆదివారం పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఢిల్లీలోని అద్వానీ నివాసంలోనే ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఇతర మంత్రుల సమక్షంలో రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

సేవలకు గుర్తింపు లభించింది: కుటుంబ సభ్యులు

దేశ అభివృద్ధి కోసం చేసిన సేవలను గుర్తించి కేంద్రం పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిందని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తన తండ్రి పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నదని కొడుకు ప్రభాకర్ రావు, కూతురు శారదా దేవి తెలిపారు. చేసిన మంచి పనులను గుర్తించి కేంద్రం ఈ పురస్కారం ఇచ్చిందని పీవీ మనమడు ఎన్వీ శ్రావణ్​ కుమార్​ అన్నారు. పీవీ చేసిన సంస్కరణలను ఇప్పటీకి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. దేశ అభ్యున్నతిలో కీలక పాత్ర పోషించిన మహనీయులను భారతరత్నతో సత్కరించుకోవడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు.

బహుముఖ ప్రజ్ఞకు నీరాజనం: కిషన్ రెడ్డి

మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావును భారత రత్నతో సత్కరించుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవీ కుటుంబ సభ్యులు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. పీవీ ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన మహనీయుడు, రాజనీతిజ్ఞుడు అని ప్రశంసించారు. ఈ పురస్కారం ఆయన బహుముఖ ప్రజ్ఞకు నీరాజనం అని అన్నారు. తెలుగు వ్యక్తి అయిన పీవీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రకటించిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

దేశ పురోగతికి  పీవీ కృషి: ప్రధాని మోదీ

దేశ పురోగతి, మోడరైజేషన్ కు మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు ఎంతో కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పీవీకి భారతరత్న పురస్కార ప్రదానంపై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. దేశం కోసం పీవీ చేసిన పనులను ప్రతి భారతీయుడు గౌరవిస్తాడని, అలాంటి మహనీయుడికి భారత రత్న లభించడం గర్వంగా భావిస్తాడని పేర్కొన్నారు. అభివృద్ధి, ఆధునికీకరణతో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పీవీ ఎంతో శ్రమించారన్నారు. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు. ప్రభావశీలి అని కొనియాడారు. మాజీ ప్రధాని పీవీ సేవలు చిరస్మరణీయం అని అన్నారు