తెలుగులో ట్వీట్ .. మోదీ ఉగాది శుభాకాంక్షలు

తెలుగులో ట్వీట్ ..  మోదీ ఉగాది శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.  కొత్తదనాన్నీ, పునరుత్తేజాన్నీ తనతో తీసుకొచ్చే ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరి జీవితాలలో అమితమైన సంతోషాన్నీ, శ్రేయస్సునీ నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ పండుగ మీ అందరి జీవితాలలో అన్ని అంశాలలో సంతోషాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. అంటూ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.  తెలుగుతో పాటుగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు మొత్తం ఐదు భాషలలో శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగువారి తొలి పండుగ. తెలుగు నెలల్లో ప్రారంభయ్యే రోజు. షడ్  రుచులతో జీవిత పరమార్ధాన్ని చెప్పే పండుగ ఉగాది. ఈ ఏడాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిగా చేసుకుంటున్నారు. చైత్రమాసం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ఉగాదిని జరుపుకుంటారు. గుమ్మాలకు మామిడి ఆకులు, రంగు రంగుల పూలతో అలంకరణలు.... ఆరు రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకం. చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, వగరుతో ఉగాది రోజు పచ్చడి చేయడం ఆనవాయితీ. జీవితంలో సుఖ దుఖ్ఖాలు, సంతోషం, బాధ, మంచి చెడులు సమపాళ్లలో ఉంటాయనే అర్థాన్ని చెప్తూ... ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.

చైత్ర మాసంతోనే తెలుగు నెల ప్రారంభం అవుతుంది. ఉగాది నుంచే అన్ని పండుగలు మొదలవుతాయి. అందుకే దీన్ని యుగారంభంగా చెప్తారు పండితులు. ఈ సీజన్లో లేలేత చిగుర్లు వస్తారు. వేప పూత, మామిడి కాత, చింత కాయలు ఈ సీజన్లోనే వస్తాయి. అందుకే ఉగాది పచ్చడి తయారీకి అప్పుడే కాస్తున్న మామిడి కాయలు, చింత పండు, వేప పూత, చెరుకు రసాన్ని ఉపయోగిస్తారు.