
న్యూఢిల్లీ: మూడు యుద్ధాల్లో ఓడినా.. ఇండియాపై పాకిస్తాన్ ఇంకా పరోక్ష యుద్ధం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఒకవేళ మరోసారి యుద్ధం జరిగినా.. 10–12 రోజుల్లోపే పాకిస్తాన్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జమ్మూకాశ్మీర్ సమస్య అలానే ఉందని, కొన్ని కుటుంబాలు, రాజకీయ పార్టీలు ఈ ప్రాంతంలో సమస్యలను ‘సజీవంగా’ ఉంచాయని ఆరోపించారు. దాని ఫలితంగానే ఇక్కడ టెర్రరిజం పెరిగిపోయిందని చెప్పారు. దశాబ్దాలుగా దేశాన్ని వేధిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇప్పుడు కాశ్మీరే కాకుండా దేశంలోని మిగతా ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సీసీ) ర్యాలీలో మోడీ ప్రసంగించారు. బోడో ఒప్పందం, ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం, ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాలను మోడీ ప్రస్తావించారు.
టెర్రరిస్టులకు గుణపాఠం నేర్పాం
‘‘కొన్నేళ్లుగా ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రాక్సీ వార్ (పరోక్ష యుద్ధం) చేస్తోంది. వేలాది మంది ప్రజలు, జవాన్లను బలితీసుకుంది” అని మోడీ ఆరోపించారు. ఇప్పుడు మరోసారి యుద్ధం జరిగినా.. 10–-12 రోజుల్లోపే పాక్‌ను ఓడిస్తామని అన్నారు. ‘‘గత ప్రభుత్వం ఎన్నో ప్రసంగాలు చేసింది. కానీ శత్రువులపై యాక్షన్ తీసుకునేందుకు ఆర్మ్డ్ ఫోర్సెస్‌కు ఎప్పుడూ పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మేం యువత ఆలోచన సాయంతో.. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. టెర్రరిస్టులకు గుణపాఠం నేర్పాం” అని చెప్పారు.
‘మిస్‌రూల్’ వల్లే కాశ్మీర్లో టెర్రరిజం
‘‘కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు 70 ఏళ్లలో ఎలాంటి ప్రయత్నమూలేదు. ఇన్నేళ్లలో 34 కుటుంబాలు కాశ్మీర్‌ను పాలించినా సమస్యను పరిష్కరించేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. ప్రాబ్లమ్స్‌ను మరింతగా పెంచారు. మిస్‌రూల్ కారణంగా కాశ్మీర్ లోయలో టెర్రరిజం పుట్టింది. వేలాది మంది అమాయకులను బలి తీసుకుంది. ఎంతో మంది ప్రజలు కాశ్మీర్‌ను విడిచి వెళ్లేందుకు కారణమైంది” అని ఆరోపించారు. 70 ఏళ్ల అక్రమ పాలన నుంచి జమ్మూకాశ్మీర్‌కు బీజేపీ విముక్తి కల్పించిందని ప్రధాని మోడీ అన్నారు.
అన్నీ పాత ఎయిర్‌క్రాఫ్ట్‌లే
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో గత 30 ఏళ్లుగా ఒక్క ‘నెక్ట్స్ జనరేషన్ ఫైటర్ విమానం’ కూడా చేర్చలేదని మోడీ అన్నారు. పాత ఎయిర్‌క్రాఫ్ట్‌లతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫైటర్ పైలట్లు చనిపోతున్నారని చెప్పారు. ఇప్పుడు ఎయిర్‌ఫోర్స్‌లోకి తర్వాతి తరం ఫైటర్ ప్లేన్ రాఫెల్ వచ్చి చేరిందని చెప్పారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని మోడీ అన్నారు. ‘‘క్రమశిక్షణ గల యువత ఉన్న దేశంలో శక్తి, పట్టుదల ఉంటుంది. అభివృద్ధి మార్గంలో ఉన్న అలాంటి దేశాన్ని ఎన్నటికీ ఆపలేరు. ఇండియాలోయువతరం ఉంది. అలాగే దేశం ఆలోచన కూడా నూతనంగా ఉండాలి” అని చెప్పారు. నార్త్ ఈస్ట్ రీజియన్‌లోని మిలిటెంట్ గ్రూపులకు రాజ్యాంగంపై నమ్మకం ఉండదని, అవి కేవలం హింసను మాత్రమే నమ్ముతాయని మోడీ అన్నారు. సోమవారం నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్డీఎఫ్బీ)తో జరిగిన ఒప్పందం చారిత్రకమని చెప్పారు.
టెర్రరిజమే పాక్ ‘స్టేట్ పాలసీ’: రాజ్‌నాథ్
సౌత్ ఆసియా రీజియన్‌లో శాంతి భద్రతలను కాపాడేందుకు సంబంధించి.. ఒక దేశం మినహా మిగతా పొరుగు దేశాలతో ఉమ్మడి విధానం రూపొందించేందుకు ఇండియా చర్చలు జరుపుతోందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఢిల్లీలో జరిగిన 12వ సౌత్ ఆసియా కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘‘ఒక దేశం సెన్సిటివిటీస్ను మరో దేశం అర్థం చేసుకోవడం, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉండటం వంటి ప్రాథమిక సూత్రాలను అనుసరించడమే.. ప్రాంతీయ శాంతి, భద్రతకు నిజమైన మార్గం. కానీ ఒక్క పాకిస్తాన్ మినహా మిగతా సౌత్ ఆసియా అంతా నాన్ ఇంటర్ఫియరెన్స్పాలసీకి కట్టుబడి ఉంది”అని చెప్పారు. టెర్రరిజాన్ని ‘రాష్ట్ర విధానం’గా ఉపయోగించడాన్ని పాక్ కొనసాగిస్తోందని మండిపడ్డారు.
మన సముద్రంలోకి చైనా షిప్‌లు
చైనా నేవీకి చెందిన షిప్‌లు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాయని ఇండియన్ నేవీ వర్గాలు తెలిపాయి. పశ్చిమ హిందూ మహా సముద్రంలో చైనా చేపల నౌకలను గుర్తించినట్లు చెప్పాయి. అయితే చేపలు పట్టే ఆ షిప్పులకు రక్షణగా చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నేవీ షిప్స్ రావడం గమనార్హం. ఇవి మొరాకో దిశగా కదులుతున్నాయని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది. ఇండియన్ ఓషన్‌లో చైనా షిప్పుల కదలికలు వేగంగా పెరుగుతున్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ కామెంట్స్ చేసిన తర్వాతే ఈ వార్త వెలుగులోకి రావడం గమనార్హం. రైజినా డైలాగ్‌లో మాట్లాడిన నేవీ చీఫ్.. చైనా మిలటరీ షిప్‌లు ఇండియా స్పెషల్ ఎకనమిక్ జోన్‌లోని జలాల్లోకి చొరబడ్డాయని తెలిపారు. మేం వెంటనే చర్యలు చేపట్టామని, దీంతో వారు గౌరవించి వెనక్కి మళ్లారని చెప్పారు.