రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న మోడీ డ్రెస్సింగ్

రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న మోడీ డ్రెస్సింగ్

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్ పథ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో మోడీ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసారి ఆయన తలపై టోపీ, మెడలో మఫ్లర్ తో సరికొత్త డ్రెస్సింగ్ లో కనిపించారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో మోడీ బ్రహ్మకమలం డిజైన్ ఉన్న ఉత్తరాఖండ్ టోపీ, మణిపూర్ ప్రజలు ధరించే సంప్రదాయ చేనేత మఫ్లర్ ధరించారు. త్వరలో ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు వాటిని ధరించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే మోడీ ఉత్తరాఖండ్ టోపీ ధరించడంపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ దామి సంతోషం వ్యక్తం చేశారు. 1.25కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు. మోడీ మణిపూర్ మఫ్లర్ ధరించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిస్వజిత్ సింగ్ సైతం సంతోషం వ్యక్తం చేశారు.